
హైదరాబాద్: సినీనటుడు పృథ్వీరాజ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. టిక్‌టాక్ తదితర సోషల్ మీడియా యాప్‌లతో తన వీడియోలను ఎడిట్ చేసి కించపరుస్తున్నారని ఆయన ఆరోపించాడు.
ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత కొన్ని రోజులుగా తన వీడియోలు ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
బాధ్యులపై కఠిన చర్యలుతీసుకోవాలని కోరాడు. పృథ్వీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల టిక్‌టాక్‌లో పృథ్వీ పోస్టు చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ‘మన అని ఎవరినీ నమ్మొద్దు. ఎందుకంటే ఇది తాతల నాటి యుగం కాదు. కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగం. మన ముందు మన మాట మాట్లాడతారు. వాడి ముందు వాడి మాట మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి’ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు.
పృథ్వీ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది ఆసక్తికరమైన చర్చకు తావిచ్చింది. ఆయన నోటి వెంట ఈ మాటలు మామూలుగానే అన్నాడా? లేక రాజకీయ ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశాడా అనే చర్చ మొదలైంది.
ఇలాంటి వీడియోల కోసం కాచుకొని చూసే ఓ వర్గానికి పృథ్వీ చేసిన ఓ అస్త్రంగా దొరికింది. ‘కల్తీ నా కొడుకులు అంటే తెలుసా..’ అంటూ ట్రోల్స్ మెదలుపెట్టారు.
గతంలో ఓ ఆడియో టేపు వల్ల రేగిన దుమారం కారణంగా ఆయన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.








