సాహోకు అంత బడ్జెట్ అవసరమా?.. ట్విట్టర్ రివ్యూ ఇదే!

10:31 am, Fri, 30 August 19

హైదరాబాద్: ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాకు వచ్చినంత హైప్ తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు మరే సినిమాకూ రాలేదు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకే పరిమితం. కొన్ని సినిమాలు దక్షిణాది రాష్ట్రాల్లో విడుదలయ్యాయి. అయితే, తెలుగు సినిమా గమనాన్ని ‘బాహుబలి’ మార్చింది.

తెలుగు సినిమా స్థాయిని బాహుబలి దేశవ్యాప్తం చేసింది. ‘బాహుబలి’ సిరీస్ ద్వారా ప్రభాస్‌ నేషనల్ హీరో అయిపోయాడు. దేశవ్యాప్తంగా విపరీతంగా ఫ్యాన్స్ పెరిగారు. అందుకే, ‘సాహో’ మొదటి నుంచి వార్తల్లో నిలిచింది. విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. విపరీతమైన బజ్ ఏర్పడింది.

దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ సినిమా ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ శుక్రవారం విడుదలైంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, ఆ ఫీడ్‌బ్యాక్ చూస్తుంటే నిజంగా భయమేస్తోంది. పాజిటివ్ కామెంట్ల కన్నా.. నెగిటివ్ ఫీడ్‌బ్యాకే ఎక్కువగా వస్తోంది.

ఈ సినిమాకు రూ.350 కోట్లు ఎందుకు పెట్టారంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టేంతగా కథ, కథనాలు దీనిలో ఏమున్నాయని నిలదీస్తున్నారు. అయితే, కొంత మంది మాత్రం సినిమా చాలా బాగుందని.. భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి యాక్షన్ మూవీ చూడలేదని కామెంట్ చేస్తున్నారు.

సినిమాను ప్రభాస్ తన భుజస్కందాలపై మోశాడని కొనియాడుతున్నారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం కూడా చాలా బాగుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ యాక్షన్ పార్ట్ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. అయితే పాటలు, రొటీన్ స్టోరీ, రన్‌టైమ్, పూర్ వీఎఫ్ఎక్స్ సినిమాకు మైనస్ అంటున్నారు. మొత్తం మీద ‘సాహో’ మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది.