
హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, తనను మానసికంగా వేధించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నటి మీరా చోప్రా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వేశ్య, పోర్న్‌స్టార్ అంటూ తన గురించి నీఛమైన రీతిలో వ్యాఖ్యానించడమేకాక తనపై యాసిడ్ దాడికి పాల్పడతామని, గ్యాంగ్ రేప్ చేస్తామని, హత్య చేస్తామని కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదిరించారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల ముప్పు ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్న మీరా చోప్రా.. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా.. తన శరీర భాగాలపై అతి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ఖాతాల వివరాలు, వారు చేసిన కామెంట్ల స్క్రీన్ షాట్లతో సహా పోలీసులకు అందజేసింది.
తనను అసభ్యకరంగా దూషించి తీవ్ర మానసిక వేదనకు గురిచేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు, సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది మీరా చోప్రా.
మరోవైపు ఈ వివాదంలో జాతీయ మహిళా కమిషన్ కూడా జోక్యం చేసుకోవడంతో ఇక మీరా చోప్రాను ఈ రకంగా వేధించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు జైలు ఊచలు లెక్కబెట్టక తప్పదేమో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అసలు వివాదం ఏమిటంటే…
బంగారం, వాన, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించిన మీరా చోప్రా ఈ మధ్య కాలంలో సినిమాల్లో యాక్టివ్‌గా లేనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది.
ఇటీవల ట్విట్టర్‌లో #AskMeera పేరిట ఆమె అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తెలుగులో మీ అభిమాన హీరో ఎవరని ఆమెను ఓ నెటిజన్ ప్రశ్నించగా.. మహేష్ బాబు అని ఆమె సమాధానం ఇవ్వడం వివాదానికి కారణమైంది.
మరో నెటిజన్ ఎన్టీఆర్ గురించి అడగ్గా.. తాను ఎన్టీఆర్ ఫ్యాన్‌ని కాదని, ఆయనకంటే కూడా తనకు మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టమని మీరా బదులిచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
మరో హీరో ముందు తమ హీరోని తక్కువ చేసి మాట్లాడటంతో తట్టుకోలేకపోయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. మీరా చోప్రాను దారుణంగా ట్రోల్ చేశారు. ఆమె శరీర భాగాలపై నీఛమైన కామెంట్స్ చేశారు.
వేశ్య, పోర్న్ స్టార్ అని వ్యాఖ్యానించడమేకాక యాసిడ్‌తో దాడి చేస్తాం, గ్యాంగ్ రేప్ చేస్తాం, మర్డర్ చేస్తామంటూ బెదిరించారు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మీరా ట్విట్టర్ వేదికగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేధిస్తున్నారని, వారిపై చట్టపపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
తన గురించి అసభ్య పదజాలం ఉపయోగిస్తూ వారు చేసిన ట్వీట్ల స్క్రీన్ షాట్లను కూడా పోలీసులకు షేర్ చేసింది. అంతేకాదు, ఏకంగా ఎన్టీఆర్‌ను కూడా ట్యాగ్ చేస్తూ.. మరో హీరో నాకిష్టం అని చెప్పినందుకు మీ అభిమానులు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో చూడండి.. ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ అయినట్లు భావిస్తున్నారా? అని ఎన్టీఆర్‌ను ప్రశ్నించింది.
దీంతో మరింతగా రెచ్చిపోయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై అసభ్యకరమైన రీతిలో పోస్ట్‌లు పెట్టడంతో ఈ వివాదం.. చినికి చినికి గాలివానలా మారి.. చివరికి పోలీసుల వరకూ వెళ్లింది.
అయితే ఈ వివాదంలో మీరా చోప్రాకు గాయని చిన్మయి శ్రీపాద తోడుగా నిలిచింది. ఇలాంటి ఇష్యూస్‌లో ముందుండి తన వాయిస్ వినిపించే సింగర్ చిన్మయి సలహా మేరకు సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించింది మీరా చోప్రా.
సోషల్ మీడియాలో ఆమెను ఎలాంటి బూతులు తిట్లారో చెప్తూ వాటి స్క్రీన్ షాట్స్ కూడా పెట్టడంతో ఆమెకు మహిళల నుంచి మద్దతు లభించింది.
మరోవైపు ఈ ట్రోల్స్‌ని తీవ్రంగా పరిగణించింది జాతీయ మహిళా కమిషన్, సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వాల్వ్ కావడంతో మీరా చోప్రాని దూషించిన వారిపై కేసులు నమోదు చేసి వారిచేత జైలు ఊచలు లెక్కబెట్టించడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఇక ఈ వివాదంపై, తన అభిమానుల వైఖరిపై ఎన్టీఆర్ కూడా స్పందించాలని మీరా చోప్రా ట్విట్టర్ వేదికగా ఇప్పటికే కోరింది. మరి ఎన్టీఆర్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
@NCWIndia @sharmarekha @hydcitypolice @Twitter plz take action against these account holder’s. They r openly #slutshamming threatning of #gangrape, #acidattack , #murder. This cannot go unnoticed. pic.twitter.com/PeEs0Sm4J2
— meera chopra (@MeerraChopra) June 3, 2020








