
హైదరాబాద్: టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఈరోజు తన 69వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. తండ్రి మోహన్‌బాబు పుట్టిన రోజుని వినూత్నంగా జరుపుకుంటున్నాడు ఆయన తనయుడు మంచు మనోజ్.
ఇకపోతే అసలు విషయానికొస్తే.. ఈరోజు మోహన్ బాబు 69వ పుట్టినరోజు జరుపుకొంటున్న సందర్భంగా మనోజ్ ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు.
ఓ బాలికను దత్తత తీసుకుని ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించాడు. నాన్న పుట్టినరోజు సందర్భంగా ఏదన్నా మంచి పని చేయాలనుకున్నానని సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే బాలికను దత్తత తీసుకున్నందుకు గర్వపడుతున్నాను అని చెప్పుకొచ్చాడు. మనోజ్ ఆ పాపని తిరుపతిలోని తమ సొంత విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ లో చేర్పించారు.
విద్యానికేతన్ లో జాయిన్ చేర్పించిన మనోజ్…
పాప బాధ్యతలన్నీ తానే తీసుకుంటానని ఈ సందర్భంగా మనోజ్ ట్వీట్ చేశాడు. పాపను జాగ్రత్తగా చూసుకుంటానని… ఐఏఎస్ అధికారి కావాలనేది పాప ఆశయమని… ఆమె అనుకున్నది సాధించేందుకు కావాల్సినదంతా చేస్తానని తెలిపాడు. ఆమెకు మంచి జీవితాన్ని ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పాడు. ఈ ట్వీట్‌పై చంద్రశేఖర్ అనే నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘మంచి పని.. కానీ ఐఏఎస్ అధికారి అవ్వాలంటూ బాలికను ఒత్తిడికి గురిచేయకండి.
ఇది తన కల అని తెలుసు. కానీ పాప పెద్దయ్యే కొద్ది ఆమె ఆశయాలు కూడా మారిపోతుంటాయి’ అన్నారు. ఇందుకు మనోజ్ సమాధానమిస్తూ.. ‘ఐఏఎస్ అధికారి అవ్వాలన్నది తన కోరిక బ్రదర్. నేనెవర్ని డిసైడ్ చేయడానికి? తనకు మంచి జీవితం ఇవ్వగలనని మాత్రం చెప్పగలను’ అని చెప్పాడు.








