
హైదరాబాద్: పెళ్లయిన తర్వాత చైతన్య, సమంత కలిసి జంటగా నటించిన తొలి చిత్రం.. మజిలీ. ఇది పక్కా ఫ్యామిలీ మూవీ. ఎలాంటి వివాదాలు లేవు. హాట్ సీన్లు అస్సలే ఉండవు. ఐనా.. ఈ సినిమా సెన్సార్ చిక్కుల్లో పడింది. దానికి కారణం డైరెక్టర్ రాంగోపాల్ వర్మనే.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకి సెన్సార్ అనుమతి ఇవ్వకుండా స్థానిక సెన్సార్ అధికారి తన అధికార ఫరిధిని మించి వ్యవహరిస్తున్నాడని ఆ మధ్య విమర్శలు చేశారు. దాంతో సెన్సార్ బోర్డు దిగివచ్చింది. వర్మ తన సినిమాని సెన్సార్ కోసం రూల్స్ ప్రకారం అప్లై చేసుకుంటే సెన్సార్ చేస్తామని చెప్పింది బోర్డు.
రూల్ ప్రకారం వర్మ సినిమాని వచ్చే వారం మొదట్లో సెన్సార్ చేయాలి. ఈ ఒక్క సినిమాకే కాదు అన్నీ రూల్స్ ప్రకారం వెళ్లాలి అని ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయట. ఆర్డర్ ప్రకారం ఎవరు అప్లై చేసుకుంటే ఆ సినిమాని ముందుగా సెన్సార్ చేస్తారు.
ఆ లిస్ట్‌లో ‘మజిలీ’ సినిమా చాలా వెనకబడిందట. మరి.. ఏప్రిల్ రెండో తేదీలోపు సినిమా సెన్సార్ కావాలి.. ఎందుకంటే మజిలీ సినిమాని ఏప్రిల్ 6న విడుదల చేస్తున్నారు. ఓవర్సీస్‌కి ప్రింట్ పంపాలంటే రిలీజ్‌కి మూడు, నాలుగు రోజుల ముందే సెన్సార్ సర్టిఫికెట్ రావాలి. దాంతో టెన్సన్ మొదలైంది.








