
హైదరాబాద్: ‘బాహుబలి’ లాంటి చారిత్రాత్మక విజయం తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ అన్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్నత ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం విడుదల కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’.. తరువాత రాజమౌళి రూపొందిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘ఆర్ఆర్ఆర్’పై ప్రేక్షకులు, అభిమానుల అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు నటీనటుల వివరాలు, కథ గురించి కొన్ని విశేషాలు తప్ప ఇప్పటి వరకు దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వలేదు. చివరికి ఈ చిత్రం టైటిల్ విషయంలోనూ సస్పెన్సే.
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. 1920 కాలానికి సంబంధించి మన దేశంలో బ్రిటీష్ వారి పరిపాలన నేపథ్యంలో ఈ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం సాగనుంది. అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా, కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.
దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మాతగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నాయికగా ఆలియాభట్, ఎన్టీఆర్ సరసన నాయికగా ఒలీవియా మోరిస్ ఎంపికయ్యారు. చిత్రంలో ప్రతినాయకుల పాత్రలో రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి నటిస్తుండగా.. కీలక పాత్రల్లో అజేయ్ దేవ్‌గణ్, సముద్రఖని నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి ‘ఆర్ఆర్ఆర్’ అనేది అన్ని భాషల్లోనూ కమన్ టైటిల్‌గా ఉంటుందని రాజమౌళి ప్రకటించడం తప్పితే.. అసలు ఆ సంక్షిప్త రూపానికి పూర్తి అర్థాన్ని ఇచ్చే టైటిల్ ఏమిటన్నది ఎవరికీ తెలియదు. పైగా అది ఒక్కో భాషలో ఒక్కో విధంగా ఉండబోతోందంటూ ఆయన చెప్పడంతో ఈ చిత్రం టైటిల్‌పై ఎవరి ఊహాగానాలు వారికున్నాయి.
అయ్యో.. ఆ టైటిల్ మిస్సయినట్లేనా?
మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’కు పూర్తి అర్థం వచ్చే టైటిల్స్ పంపమని రాజమౌళి అభిమానులను కోరగా.. అన్ని భాషల అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తెలుగుకు సంబంధించి ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్ ఎక్కువగా వినిపించింది. ఈ చిత్రం ప్రారంభం నుంచి ఈ టైటిల్ ప్రచారం ఉంది.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్ కూడా ఈ చిత్రానికి దక్కే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే, ఈ ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్ సౌండింగ్ బాగుండడంతో ఇప్పటికే వీ3 ఫిలిమ్స్ సంస్థ ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేయించుకుందట. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం యూనిట్ మరో టైటిల్ ఆలోచించుకోవలసిందే అని అంటున్నారు.
దీంతో ఇటు అభిమానులు కూడా కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. మరి ఈ తాజా పరిణామం నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి మనసులోని మాట ఏమిటో? టైటిల్ విషయంలో ఆయన ఏం చేయబోతున్నారో అనేది సస్పెన్సే.








