27.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ కొత్త సినిమాలు గురూ! ఓటమి నుంచి.. విజయం వైపు పయనించే.. మజిలీ, జెర్సీ, చిత్రలహరి

కొత్త సినిమాలు గురూ! ఓటమి నుంచి.. విజయం వైపు పయనించే.. మజిలీ, జెర్సీ, చిత్రలహరి

- Advertisement -
ఇదే విజయ సూత్రం.. కలెక్షన్ల వర్షం

ఈ మధ్యకాలంలో సినిమాలకు జనం వెళ్లడం లేదు.. అని తెగ కామెంట్లు చేస్తుంటారు..కానీ ఎందుకు వెళ్లడం లేదని ఒక్కరూ ఆలోచించరు. కానీ ఇటీవల వరుసగా విడుదలైన మూడు సినిమాలు..బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. మరెందుకు ఆ సినిమాలు అలా చూస్తున్నారు..అంటే ప్రశ్నకు సమాధానం ఉందా?

అయితే ఇంతకుముందు ఒక సినిమా సూపర్ హిట్ అయితే తర్వాత సినిమా కలెక్షన్లు తగ్గిపోతాయేమోనని ఆందోళన పడేవారు.. ఇప్పుడా బాధే లేదు.. సినిమా బాగుంటే.. వరుసగా ఎన్ని సినిమాలు వచ్చినా కుటుంబ సమేతంగా చూసేందుకు వెనుకాడమని తేల్చి చెబుతున్న తెలుగు ప్రేక్షకుల తీరు సినీ పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.  

ఇంతకీ మారిన ట్రెండులో వరుస విజయాలు అందుకున్న ఆ మూడు సినిమాల కబుర్లు మీకోసం..

ముచ్చటగా మూడు సినిమాలు..

తెలుగు సినిమా ప్రేక్షకులను మంత్రముగ్థులను చేశాయి. ఈమధ్యకాలంలో ఈ తరహాలో ఆడిన సినిమాలు కనిపించలేదంటే అతిశయోక్తి కాదు.  2019 జనవరి నెల తర్వాత ఇప్పటివరకు విజయం కోసం ముఖం వాసిపోయిన..సినీ పరిశ్రమకు..కొత్త ఊపిరి పోసినట్లయ్యింది.

ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో కాసులు గలగలాడుతున్నాయి. దీంతో కొత్తదనం కోసం వెతికే ప్రయత్నంలో నిర్మాతలు, దర్శకులు పరుగులు తీస్తున్నారు. ఇంతకీ ఆ మూడు సినిమాలు ఏమిటనే కదా.. మీ ఉద్దేశం..అదేనండి..

నాగచైతన్య నటించిన మజిలీ, నానీ నటించిన జెర్సీ, సాయి తేజ్ నటించిన చిత్రలహరి..

ఇవి వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా బాక్సాఫీస్ ను బద్దలుకొట్టాయి. ప్రతి సినిమాకు జనం వస్తున్నారు. రికార్డ్ కలెక్షన్లు వసూలవుతున్నాయి. అయితే ఇంతకీ మూడు సినిమాల్లో ఉన్న కొత్త పాయింట్ కన్నా.. ఒక కామన్ పాయింట్ అందరినీ ఆలోచింప చేస్తుంది.

అదేమిటంటే ఒక ఫెయిల్యూర్ నుంచి విజయం వైపు ప్రయాణం..

జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తే..అలాగే ఆలోచించి..ఆలోచించి.. బుర్రలు పాడుచేసుకొని జీవితమింక అయిపోయిందనుకొని..రాజీ పడి బతికేసే నూటికి 90శాతం మందిలో  ఒక ఓటమి వస్తే కుంగిపోకుండా..విజయం కోసం పోరాడితే..ఫలితం తప్పకుండా వస్తుందని నిరూపించిన సినిమాలు ఇవి.. వీటిని ఒకొక్కదాన్ని వరుసగా మనం పరిశీలిస్తే..

Majili , Naga Chaitanya, Samantha, Newsxpressonline
మొదట మజిలీ సినిమా గురించి చర్చిస్తే. ఇది లవ్ ఫెయిల్యూర్ స్టోరీ

ఇందులో హీరో నాగచైతన్య ఒక ప్రేమికుడు.. అతని ప్రేమ విఫలమవుతుంది. ఇక జీవితమంతా అయిపోయిందనుకొని తాగుడుకి బానిసై..అందులోనే నిత్యం బతుకుతుంటాడు. ఇంకెవరూ ఇతన్ని బాగుచేయలేరని ఫిక్స్ అయిపోయిన సమయంలో..కొన్ని సంఘటనలు అతని జీవితంలో సీక్వెల్ గా వస్తాయి. అందులో ప్రధానమైనది హీరోయిన్ సమంత..తాగుబోతు, ప్రేమ విఫలమైనవాడు, ఉద్యోగం, సద్యోగం లేనివాడు..ఇలాంటివెన్నో ఉన్నా..అతన్నే పెళ్లి చేసుకుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి అతన్ని ప్రేమించింది. కానీ అతను ఇంకో అమ్మాయిని ప్రేమించి..మరిచిపోలేకపోతున్నాడు.

బయటపడలేని రెండు మనసుల భయంకరమైన సంఘర్షణ..అక్కడ స్క్రీన్ పై మనకు అద్భుతంగా కనిపిస్తుంటుంది. చివరికి మొదట ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, ఆ అమ్మాయి కూతురు తిరిగి నాగ చైతన్య వద్దకు రావడం..తన తల్లి వల్ల పిచ్చివాడైపోయిన ఒక ప్రేమికుడిని ఆ చిన్నమ్మాయి..తిరిగి మార్చి..ఆ దంపతులిద్దరినీ కలిపేందుకు ప్రయత్నించడలో సీక్వెన్స్ కుదిరి.. కథ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఇక్కడ..కథలో విషయమేమిటంటే ప్రేమ విఫలమై..తిరిగి హీరో మళ్లీ మామూలు మనిషి కావడం..

ఇందులో ఒక చక్కని మాట ఉంది..

ప్రేమించినమ్మాయికి క్రికెట్ నేర్పించే కోచ్ గా హీరో వెళుతూ..ఆ అమ్మాయి తాతయ్యతో ఒక మాటంటాడు. క్రికెట్ బాగానే ఆడుతుంది..కానీ ఆటిట్యూడే కరెక్ట్ గా లేదు..అని చెబుతాడు. అంటే టాలెంట్ ఉన్నా ఆటిట్యూడ్ ఎంత ముఖ్యమో ఒక్క ముక్కలో చెబుతారు.

Jersey Movie News, Nani, Newsxpressonline
రెండో సినిమా జెర్సీ విషయానికి వస్తే..తండ్రి విలువ చెబుతుంది..

హీరో నాని నటనకు హ్యాట్సాఫ్ అని ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇది పిల్లలతో కలిసి తల్లిదండ్రులందరూ కలిసి చూడాల్సిన సినిమా..ఎందుకంటే ఒక తండ్రి..తన కొడుకు కోసం..ఎంత తపన పడతాడు..ఎంత కష్టపడతాడు..అన్నది ఈ సినిమా చూపిస్తుంది.

 అలాగే డబ్బుల విలువ చెబుతుంది..

ఒక 500రూపాయల కోసం హీరో పడే పాట్లు..ఎంత ఘోరంగా ఉంటాయో సినిమా కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. పిల్లలందరూ ఈరోజున ఎంతో జల్సాగా ఖర్చు చేస్తున్నారు. కానీ తల్లిదండ్రలు వారికోసం ఎంత కష్టపడుతున్నారన్నది సినిమా చూశాక వారి మనసులో ఉండిపోతుంది. అందుకోసమైనా వారిని తప్పనిసరిగా  తల్లిదండ్రులు తీసుకువెళ్లాలి.

ఇక కథలోకి వస్తే..

హీరో ఒక గొప్ప క్రికెటర్..అనివార్యకారణాల వల్ల అతను ఇండియన్ క్రికెట్ టీమ్ కి సెలెక్ట్ కాలేడు. ఆ కారణం చెప్పి అతను క్రికెట్ కు గుడ్ బై చెప్పి..ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే.. అక్కడ విధి వెక్కిరించి..సస్పెండ్ అవుతాడు. అప్పుడు అతనికి కష్టాలు మొదలవుతాయి. భార్య ఒక్కరి సంపాదనతో ఆ కుటుంబం నడుస్తుంటుంది.

మధ్య తరగతి అసంతృప్తి

మధ్యతరగతి భార్య తిట్లు, అసహనం, అసంతృప్తి, ఆవేదన, ఆక్రోశం.. ఒకటి కాదు.. ఇవన్నీ భర్తగా నాని ఒకవైపు భరిస్తూ ఉంటాడు..అలాగే తన ఎనిమిదేళ్ల కుర్రాడి చిన్నిచిన్ని కోరికలు తీర్చలేని నిస్సహాయత తో నలిగిపోతుంటాడు. ఇవన్నీ కలిపి..అతను ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాడు. మళ్లీ క్రికెట్ బ్యాట్ తీసుకొని 36 ఏళ్ల వయసులో ప్లేయర్ గా బయలుదేరుతాడు.

నిజజీవితంలోకి వస్తే…

చాలామంది తమ కెరీర్ ముగిసి పోయిందని అనుకుంటుంటారు..మనిషిలో బలమైన సంకల్పం ఉంటే.. కెరీర్ ఆగిపోలేదని చెప్పడమే..ఈ చిత్రం మరో ఉద్దేశం..అలా ఆగిపోయిన క్రికెట్ నుంచి.. తిరిగి మళ్లీ భవిష్యత్తు వెతుక్కునే క్రమంలో సినిమా నడుస్తుంది. కానీ ఎందుకిలా చేస్తున్నావని భార్య అడిగితే.. అక్కడ జరిగే ఒక అద్భుతమైన సన్నివేశంలో..

నాని..తన భార్య దగ్గర ఇలా చెబుతాడు..

నా కొడుక్కి 500 రూపాయలు పెట్టి ఒక జెర్సీ కొనలేకపోయాను. రేపు వాడు పెరిగి పెద్దవాడయ్యాక..మరో పెద్ద కోరిక కోరితే నా పరిస్థితేమిటి? అనిపించింది. నేను ఎవరివద్దనైనా డబ్బులు అప్పు తీసుకునేటప్పుడు తిరిగిచ్చేస్తాను అని చెబుతాను..కానీ వాళ్లకు తెలుసు.. నేనివ్వలేనని.. కానీ నా కొడుకు మాత్రం నేనింకా ’జెర్సీ’ కొనిస్తాననే అనుకుంటున్నాడు.

గుండెలను తడిమే సన్నివేశాలు

ఇప్పుడు కాలనీ వాళ్లు, అందరి దృష్టిలో నేను ఒక జీరో.. కానీ ఎనిమిదేళ్ల నా కొడుకు దృష్టిలో మాత్రం హీరోగా ఉన్నాను. రేపటి గురించి ఆలోచిస్తుంటే..వాడి దగ్గర కూడా జీరో గా మారకూడదనే ఉద్దేశంతో తిరిగి బ్యాట్ పట్టుకున్నాను.. గుండెలను తడిమే అలాంటి సన్నివేశాలు సినిమాంతటా ఉన్నాయి. కానీ నానీ ఎంతటి తీవ్ర నిర్ణయం.. తీసుకున్నాడో సినిమా చూసిన తర్వాతే ప్రేక్షకులకు తెలుస్తుంది.

ఇది ఒక ఫెయిల్యూర్ స్టోరీనే.. ఓడిపోయిన మనిషి..తిరిగి విజయం వైపు ఎలా పోరాడి గెలిచాడు అనేది అద్భుతంగా దర్శకుడు చూపించాడు.

chitralahari, Sai Dharam Tej, Newsxpressonline
ఇక మూడో సినిమా.. చిత్రలహరి..

ప్రస్తుతం  సాఫ్ట్ వేర్ యువత మనస్తత్వానికి అతి దగ్గరగా తీసిన సినిమా.. ఒక కార్పొరేట్ కంపెనీకి వెళ్ళి.. ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడే ఒక సాఫ్ట్ వేర్ ను తయారేచేసే ఆలోచనను ప్రాజెక్టుగా మార్చి..తిరిగే క్రమంలో హీరోకి ఎదురైన ఎన్నో అవమానాలు, అనుభవాల సమాహారమే ఈ సినిమా..

ప్రస్తుతం యువత తీరు, నడవడికకు అద్దం పట్టిన సినిమా ఇది..

ఇది కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ చదివే పిల్లలుంటే వారిని తీసుకువెళ్లి చూపించడం చాలా ఉత్తమమైనది. ఎందుకంటే సినిమాలో హీరో చాలా టాలెంటెడ్..కానీ అతనికి ఉన్న బలహీనత.. కంట్రోల్ లేకపోవడం..మాట తీరు, నడవడికి, తాగడం ఇలా అన్నమాట.. అంటే క్యారెక్టర్ లేకపోవడమని అర్థం.. ఇందులో నీతేమిటంటే..

నువ్వెంత గొప్పవాడివైనా…

నువ్వెంత మొనగాడివైనా, నీలో ఎన్ని తెలివితేటలున్నా.. నీ క్యారెక్టర్ బాగా లేకపోతే అన్నీతుఫాను గాలిలో కొట్టుకుపోయినట్టు పోతాయి..అని చూపించిన సినిమా.. ఇంకా గొప్పవిషయ మేమిటంటే.. ఏమున్నా లేకపోయినా ముఖ్యంగా క్యారెక్టర్ పాడు చేసుకోవద్దు..అని చెబుతుందీ సినిమా..

అలాగే సక్సెస్ కావాలంటే నిరంతరం కష్టపడుతూనే ఉండాలి..

ఏ దశలోనూ నిరాశలోకి వెళ్లిపోకూడదు.. అని కూడా చెబుతుంది.. అయితే ఇందులోనే ఇంటర్నల్ గా హీరోయిన్ పాత్రకు సంబంధించి ఒక మంచి మెసేజ్ ఉంది,. పెళ్లిళ్లు చేసుకునేటప్పుడు, జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు.. దయచేసి ఫ్రెండ్స్ సలహాలు మాత్రం తీసుకోవద్దు అని ఇందులో సారాంశం.. ఎందుకంటే మీ ఇంట్లో నీ పరిస్థితి వేరు.. నీ ప్రెండు ఇంట్లో తన పరిస్థితులు వేరు కావచ్చు..లేదా ఆమె చూసిన ప్రపంచం వేరు కావచ్చు..లేదా తన మైండ్ సెట్ కరెక్ట్ గా లేకపోవచ్చు..లేదా నీపై  ఇంటర్నల్ ఈగో ఉండవచ్చు..

అందువల్ల నీ ప్రేమ, పెళ్లి విషయాల్లో  మీ ఫ్రెండ్స్ పై అతిగా ఆధారపడితే..

మంచివాళ్లని మిస్ అయిపోయే అవకాశాలున్నాయని కూడా పాత్రల ద్వారా చక్కగా చెప్పించారు. ఇలా అన్నిరకాలుగా సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా చెప్పాలి. అలాగే ఒక తండ్రి తన కొడుకు సక్సెస్ కి ఎంతగా సహకరించాడు అనేది కూడా చక్కగా పోసాని కృష్ణమురళీ కారెక్టర్ ద్వారా చెప్పించారు. ఇది కూడా ఒక ఫెయిల్యూర్ స్టోరీయే.. జీవితంలో ఎన్నో ఓటముల నుంచి అతను సక్సెస్ దిశగా ఎలా సాగిపోయాడనేది సినిమా చూసే తెలుసుకోవాలి.

చాలామంది సినిమానే కదా..

అని తీసి పారేయకండి..చూసి వదిలేయకండి.. మంచి సినిమాలు రావడం లేదని కామెంట్లు చేసేటప్పుడు.. వచ్చినప్పుడు చూసి..ఫీలై.. భవిష్యత్తులో ఫెయిల్యూర్స్ వల్ల ఆగిపోయినవేవైనా ఉంటే తిరిగి ప్రారంభించండి.. ఆల్ దిబెస్ట్

– శ్రీనివాస్ మిర్తిపాటి

 

 

 

 

- Advertisement -