జయప్రద పాలిటిక్స్‌లోకి ఎలా వచ్చారో తెలుసా? ఇదీ ఆమె సినీ, రాజకీయ ప్రస్థానం!

4:43 pm, Wed, 17 April 19
actress-jayaprada-cinema-and-political-career

హైదరాబాద్: భారత దేశంలోని అగ్ర కథానాయకులందరితో నటించడమేకాక.. ‘ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ది ఇండియన్ స్క్రీన్’.. అని ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే నుంచి ప్రశంసలు అందుకున్న కథానాయకి ఎవరో తెలుసా? లలిత కుమారి. అర్థం కాలేదు కదూ? జయప్రద.. అంటే అందరికీ అర్థమైపోతుంది. అవును, సినీనటి జయప్రద అసలు పేరు లలిత కుమారి.

వెండితెరకు పరిచయం చేసేటప్పుడు ఆమె పేరు జయప్రదగా మారిపోయింది. అలా జయప్రదగా మారిన లలిత కుమారి కథానాయకిగా తెలుగు సినీ రంగాన్ని కొన్నేళ్లపాటు ఏలింది. ఆ తరువాత బాలీవుడ్‌కు వెళ్లినా.. అక్కడ కూడా జయప్రద సక్సస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.

అలా.. అలా.. తెలుగు, హిందీ భాషల్లోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల సినిమాల్లోనూ నటించి వెండితెరకే వన్నెతీసుకొచ్చింది జయప్రద.

అలాంటి జయప్రద ఆ తరువాత సినిమాలు మానేసి రాజకీయాల్లోకి ప్రవేశించింది. అసలు ఆమెను రాజకీయాల్లోకి ఆహ్వానించిన వారెవరో తెలుసా? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నేత ఎన్టీఆర్. అవును, 1994లో ఎన్టీఆర్ ఆహ్వానం మేరకే జయప్రద టీడీపీలో చేరారు. మరి జయప్రద సినీ, రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో చూద్దామా…

సినీ ప్రస్థానం…

జయప్రద అసలు పేరు లలిత కుమారి. సినిమాల్లోకి వచ్చాక ఆమె పేరును జయప్రదగా మార్చేసుకున్నారు. జయప్రద నటించిన తొలి సినిమా భూమికోసం. 1974లో ఈ సినిమా విడుదలైంది. జయప్రద మొత్తం ఆరు భాషల్లో.. అంటే, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో 300కుపైగా సినిమాల్లో నటించింది.

ఎన్టీఆర్, రాజ్‌కుమార్, అమితాబ్, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి నుంచి మొదలుకుని బాలీవుడ్ తరువాత తరం అక్షయ్ కుమార్ వంటివారితో కూడా నటించారామె. 1986లో ఆమె శ్రీకాంత్ నహతా అనే ప్రొడ్యూసర్‌ను వివాహం చేసుకున్నారు.

ఇక ఆమె చివరి సినిమా 2005లో విడుదలైంది. ఆ తరువాత అడపాదడపా సినిమాల్లో పలు క్యారెక్టర్లలో నటించినా తన ఫోకస్ అంతా రాజకీయాలపైనే పెట్టారు.

రాజకీయ ప్రస్థానం…

దివంగత నేత ఎన్టీఆర్ ఆహ్వానంతో 1994 అక్టోబర్ 10న టీడీపీలో చేరారు జయప్రద. ఆ తరువాత చంద్రబాబు నాయుడి వర్గంలో ఉంటూ ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగానూ పని చేశారు. 1996లో ఆమె టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.

ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరి తన రాజకీయ భవిష్యత్తుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని వేదికగా చేసుకున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2010లో అమర్ సింగ్‌తోపాటు జయప్రద కూడా సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.

ఆ తరువాత వారిద్దరూ మరుసటి ఏడాదే రాష్ట్రీయ లోక్‌మంచ్ అనే కొత్త పార్టీని స్థాపించారు. ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేసినా ఆ పార్టీ తరుపున ఏ ఒక్కరూ విజయం సాధించలేదు. ఇక 2014 ఎన్నికల సమయంలో జయప్రద అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్ఎల్‌డీలో చేరి పోటీ చేసినా ఫలితం లేకపోయింది.

గత నెలలో బీజేపీలో చేరిన జయప్రద మళ్లీ ఒకసారి ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్నారు. ఆమెపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్ పోటీగా నిలిచారు.

ములాయం సింగ్ యాదవ్ హయాంలో ఒకప్పుడు జయప్రదకు నీరాజనం పట్టిన సమాజ్‌వాదీ పార్టీ నేడు ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో తిరిగి ఆమెపైనే నిప్పులు గక్కుతోంది. మళ్లీ ఇన్నాళ్లకు క్రియాశీలక రాజకీయాలకు దగ్గరైన జయప్రద.. రాంపూర్ స్థానం నుంచి విజయదుందుభి మోగిస్తారా? లేదా? అన్నది తెలియాలంటే ఎన్నికలయ్యే వరకు వేచి చూడాల్సిందే!