తిరుమల: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘తానో నాస్తికుడినని, అసలు దేవుడిపై నమ్మకమే లేదని’ చెప్పుకుంటూ ఉంటారు . కానీ ఉన్నట్లుండి ఆయనకు దేవుడిపై భక్తి పొంగిపొర్లింది. అంతే – ఒక్కసారిగా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు.
అంతేకాదు, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ కొత్త ప్రాజెక్టుపై స్పీడ్ పెంచారు వర్మ. ఈ సినిమా ఒక్కసారిగా ఆయనలో అనుకోని మార్పు తెచ్చింది. అంతే – తిరుమల వేంకటేశ్వరుడి సాక్షిగా సినిమాకు సంబంధించిన వివరాలు చెప్పేందుకు సిద్ధమయ్యారు.
గురువారం రాత్రే తిరుమలకు చేరుకున్న వర్మ శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఇందుకు కారణం దివంగత నటుడు నందమూరి తారక రామారావేనని, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’సినిమాలో వాస్తవాలను చూపించే విధంగా ఆశీర్వదించమని కోరుకున్నాని వర్మ చెప్పారు.
ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటానని వర్మ గురువారం ట్విట్ చేశారు. అన్నట్లుగానే శుక్రవారం కొంతమంది బంధువులతో కలిసి కాణిపాకం గణపతిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఎన్టీఆరే నన్ను ఇలా మార్చేశారు….
స్వామివారిని దర్శించుకున్న తర్వాత చేతిలో తిరుపతి లడ్డూ పట్టుకుని, భుజంపై కండువా వేసుకుని, నుదుట బొట్టుతో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని గెటప్‌లో దిగిన ఫొటోని వర్మ ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోసం.. ఎన్టీఆర్ తనను ఇలా మార్చేశారంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోని చూసి వర్మ అభిమానులు షాకయ్యారు. ‘‘మేం చూస్తున్నది వర్మనేనా? ఇంత మార్పా?’ అని కామెంట్లు పెడుతున్నారు.
తను పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేదని, ఎన్టీఆర్ మీద గౌరవంతో తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్నానన్నారు వర్మ. తను తీసిన ‘గోవిందా.. గోవిందా’ భక్తి సినిమా కాదని.. అది యాక్షన్ సినిమా అని.. తనకు దేవుడి మీద కాదు.. భక్తుల మీద కూడా నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.
శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని శిల్పారామంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని వర్మ ప్రకటించారు. జీవీ ఫిల్మ్స్ సంస్థ సమర్పిస్తున్న ఈ చిత్రానికి రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అలాగే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను వర్మ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేసిన సేవలు, ఆయన చనిపోయాక జరిగిన అంతిమయాత్ర దృశ్యాలను చూపించారు.
‘‘ఎన్టీఆర్ నిజమైన అభిమానులందరికీ నా బహిరంగ ప్రకటన. నిజానికి నిజంగా జీవించేవారికి మరణం ఉండదు..’ అంటూ రామ్‌గోపాల్ వర్మ ఈ వీడియోలో పేర్కొన్నారు.