
హైదరాబాద్: సినీ నటి రేణు దేశాయ్ తాజాగా చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె తన రెండు లగ్జరీ కార్లను అమ్మేశారు. ఆర్థిక ఇబ్బందులేమో.. అనుకునేరు, కానే కాదు.
ఆమె చెప్పిన కారణం వింటే.. నిజమే కదా అనిపిస్తుంది ఎవరికైనా. అంతేకాదు, ఈ విషయంలో ఆమె అందరికీ ఆదర్శం కూడా.
రేణు దేశాయ్ అమ్మేసిన ఆ రెండు లగ్జరీ కార్లలో ఒకటి ఆడీ ఏ6 కాగా రెండోది పోర్షే బాక్సర్. వీటిని అమ్మేయడానికి గల కారణాలను ఆమె సోషల్ మీడియా వేదికగా వివరించారు.
తన కార్లను అమ్మేసి ఆ స్థానంలో ఈ-ఎలక్ట్రిక్ హ్యుండాయ్ కారును కొన్నానని రేణు వెల్లడించారు. మారిష్‌లో జరిగిన చమురు లీకేజీ గురించి చదివిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని ఆమె పేర్కొన్నారు.
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా డిజీల్, పెట్రల్‌తో నడిచే వాహనాల వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో తన రెండు లగ్జరీ కార్లను అమ్మేసినట్టు రేణు పేర్కొన్నారు.
ఇంధనాలతో నడిచే వాహనాలను వినియోగించడం వల్ల భూమి మీద ఉండే జీవులకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అందుకే పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. అందరూ ఎలక్ట్రిక్ కార్లు, బైకులను కొనాలని పిలుపునిచ్చారు.
రేణు దేశాయ్ నటనకు గుడ్‌బై చెప్పినా.. సినిమాలను డైరెక్ట్ చేస్తూనో, ప్రొడక్షన్ చేస్తూనో, సామాజిక కార్యకలాపాలను చేపడుతూనో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
తాజాగా ఆమె చేసిన ఈ మంచి పనితో మరోసారి వార్తల్లోకి వచ్చారు.








