వెనకా ముందు సిని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కొద్దిగా కూడా లేని కొత్త హీరో…
గ్లామర్ బొత్తిగా లేని కొత్త హీరోయిన్…
వర్మ క్యాంప్ నుంచి వచ్చిన కొత్త డైరక్టర్…
మినిమం ఓపినింగ్స్ ఉంటాయా?
కాస్తంత మసాలాతో ట్రైలర్ వదిలితే జనం టిక్కెట్ కౌంటర్ దగ్గర కొట్టేసుకోరూ..?
రైటే అనుకో… కానీ కథలో కంటెంట్ ఉండద్దా?
మన టైటిలే డిఫెరెంట్ RX100…
అంటే ఓ బైక్ ఆత్మకథా.. అసలే ఆత్మకథలు సీజన్ నడుస్తోంది..
అబ్బే.. మనది బోల్డ్ లవ్ స్టోరీ…
అంటే బూతా..?
అబ్బబ్బే.. బోల్డ్, అంటే ‘అర్జున్ రెడ్డి’లా అల్లాడిస్తాం…
‘అర్జున్ రెడ్డి’ ఆల్రెడీ వచ్చేసిందిగా.. మళ్లీ ఎందుకూ..?
మన సినిమా నేరేషన్ చాలా రియలిస్టిక్ గా రామ్ గోపాల్ వర్మ స్టైల్లో ఉంటుంది.
అంటే బూతుని కూడా.. అదే అదే.. బోల్డ్ ని కూడా చాలా రియలిస్టిక్ గా తెరకెక్కిస్తానంటావ్..?
చూడండి… చించేద్దాం…
ఏంటి హీరో, హీరోయిన్ దుస్తులా చించేది?.. ముందు జనం తెరను చించకుండా చూడు..!
ఇలాంటి సంభాషణలతో మొదలైందనిపించే ఈ చిత్రం అసలు కథేంటి? బైక్ కు లవ్ స్టోరీకి సంబంధం ఏమిటి? బోల్డ్ ఎలిమెంట్స్ బోలెడు ఉన్నాయా?వంటి విషయాలు రివ్యూలో చూద్దాం…
ఆత్రేయపురంలో RX100 బండి వేసుకుని తిరిగే.. శివ(కార్తికేయ) చిన్నప్పుడే తల్లి తండ్రులను యాక్సిడెంట్ లో పోగొట్టుకుంటాడు. అతన్ని డాడి(రాంకీ) చేరదీసి సాకుతాడు. డాడీ..ఆ ప్రాంతం జెడ్ పీ టీసి మెంబర్ అయిన విశ్వనాథం(రావు రమేశ్) తరుపున పనిచేస్తుంటాడు. ఓ రోజున విశ్వనాథం కూతురు ఇందు(పాయల్ రాజ్‌పుత్)శెలవులకు ..ఆ పల్లెకు వస్తుంది. అక్కడ శివను చూడగానే ఇష్టపడుతుంది.
అది ప్రేమగా మారి… ఇద్దరూ శారీరకంగా కూడా దగ్గర అవుతారు. అయితే ఈలోగా ఆమెకు ఇంట్లో వాళ్లు ఓ ఎన్నారై సంబంధం చూసి చేసేస్తారు. ఆమె అమెరికా వెళ్లిపోతుంది. దాంతో శివ ఆమె తండ్రిపై కోపం పెంచుకుని ఆయన ఆస్తులు ధ్వంసం చేస్తుంటాడు. ఓ సైకోలా బిహేవ్ చేస్తూంటాడు.
ఈలోగా ఓ రోజు ఆమె అమెరికా నుంచి తన ఊరికి వస్తుంది. అప్పుడు శివ ఆమెను కలవాలని విశ్వప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆమె గురించిన ఓ ఊహించని నిజం బయిటపడుతుంది. ఆ నిజం ఏమిటి? అప్పుడు శివ ఏం చేశాడు? ఆ ప్రేమ కథ ఎలాంటి ముగింపునకు దారి తీసింది? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
పాత కథ, కొత్త ట్విస్ట్…
ఇలాంటి తేజ మార్క్.. పెద్దింటి అమ్మాయి.. మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమ కథలు మనకు కొత్తేం కాదు. అయితే ఇందులో ఉన్నదల్లా ఆ కథకు అడ్వాన్సెడ్ వెర్షన్ లా… సెకండాఫ్ లో పెట్టుకున్న ఓ ట్విస్ట్ మాత్రమే. ఆ ట్విస్ట్ వచ్చే దాకా అప్పట్లో తేజ తీసి రిలీజ్ చేయకుండా వదిలేసిన ఓ సినిమానా ఇది అని డౌట్ వస్తూంటుంది. అలాగే చాలాసార్లు ఈ సినిమా అర్జున్ రెడ్డి సినిమాని గుర్తు చేయటం విశేషం. మరి రిఫెరెన్స్ గా ఆ సినిమా పెట్టుకున్నట్లున్నారు.
అలాగే ఈ సినిమాలో సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తప్పించి చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ ఏమీ లేవు. దాంతో ఆ ట్విస్ట్ వచ్చేదాకా కథని లిప్ లాక్ కిస్‌లతో, ఐటం సాంగ్‌తో, హాట్ సన్నివేశాలతో నింపేసే ప్రయత్నం చేశారు.
దానికి తోడు సినిమా మొదటి నుంచీ రాంకినే హీరో చుట్టూనే కథ తిరుగుతుంది. హీరో సైడ్ పాత్రలా కనిపిస్తూంటాడు. హీరో సినిమాలో ఎక్కువ సార్లు పరుగెట్టడం, బండి స్టార్ట్ చేయటం, సిగెరెట్లు కాల్చటమే సరిపోయింది.
టు బి ఫ్రాంక్.. చెప్పాలంటే.. చివరి ఇరవై నిమిషాలు తప్పితే సినిమాలో ప్రేక్షకులు పూర్తిగా లీనమయ్యేలా చేసే ఎలిమెంట్ లేదు.
హైలెట్…
ఈ సినిమాలో హైలెట్ గా చెప్పుకోవాల్సింది బోల్డ్ గా లేడీ అర్జున్ రెడ్డిలా అనిపించే హీరోయిన్ క్యారక్టరైజేషన్, బిహేవియర్. అదే కొత్తగా అనిపించింది.
వర్కవుట్ అయ్యేవి…
ఈ సినిమా ఫస్టాఫ్ లో వచ్చే.. హాట్ సీన్స్ ( తేజ చిత్రంలో వచ్చే ఏకాంత వేళ సాంగ్ టైప్ )
సెకండాఫ్ లో హీరోయిన్ గురించి అసలు నిజం తెలుసుకుని ఆమె తండ్రి తిట్టే సీన్
ప్రేమలో మోసపోయామనుకునే వాళ్లు, మోసపోయిన వాళ్లు హీరో పాత్రలో ఐడింటిటీ అయ్యే అవకాసం..
డబ్బున్న అమ్మాయిలు మోసం చేస్తారు అని చాలా మంది నమ్మే విషయం మరోసారి ఈ సినిమాలో గట్టిగా చెప్పటం.
టెక్నికల్ గా…
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. సీన్స్ ని లేపాల్సింది పోయి.. చాలా చోట్ల పడేసింది. ఇక పాటల్లో… కొడవలి నిండా కుంకుమ పూలే.., పిల్లా రా పాటలు బావున్నాయి. వాటి పిక్చరైజేషన్ అంతంత మాత్రమే. సెకండాఫ్ లో ఆ ఐటం సాంగ్… కొన్ని అర్దం లేని ఫైట్స్ తీసేస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ సినిమాకు తగినట్లు ఉంది. గ్లామర్ లేకపోయినా హీరోయిన్ ఫెరఫార్మెన్స్ పరంగా బాగా చేసింది. హీరోగా చేసిన కుర్రాడు ఓవర్ రియాక్షన్స్ తగ్గిస్తే రాణిస్తాడు.
గోడ పక్కన సీన్…
పూర్వకాలం సినిమాల్లో ఓ పాత్ర..సినిమాలోని ఓ కీలకమైన రహస్యాన్ని .. గోడ పక్కన నిలబడి కథని మలుపు తిప్పుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి గోడ చాటు ట్విస్ట్ సీన్స్ ఎవరూ వాడటం లేదు. అలాంటి ట్విస్ట్ పెట్టి… ప్రేక్షకులను మళ్లీ ఆ రోజుల్లోకి తీసుకెళ్లినందుకు మాత్రం దర్శకుడు అజయ్ భూపతికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.
(ఓ సీన్‌లో రాంకీ పాత్ర … రావు రమేష్ ఇంటికెళ్లి… అక్కడ గోడ పక్కన నిలబడి హీరోయిన్ చెప్పే అసలు సీక్రెట్ వినటం.)
ట్విస్ట్ పేలిందా?
కొద్దిగా ఊహ ఉన్నవాళ్లకి ఫస్టాఫ్ హీరో, హీరోయిన్లు కలుసుకున్నప్పుడే ట్విస్ట్ ఊహించేయచ్చు. మిగతావాళ్లు ట్విస్ట్ ఫీల్ అవుతారు.
ఎవరికి నచ్చచ్చు…
ఎంటర్టైన్మెంట్స్ సీన్స్ పొరపాటున కూడా లేకుండా..హాట్ సన్నివేశాలతో నిండిన ఈ సినిమా ఫ్యామిలీలకు కష్టం అనిపిస్తుంది. అదే సమయంలో అడల్ట్ సీన్స్, హింసాత్మక సన్నివేశాలు .. బి, సి సెంటర్లలలో కలెక్షన్స్ తెచ్చిపెట్టే అవకాసం ఉంది.
ఫైనల్ థాట్…
డాడీ..’అర్జున్ రెడ్డి’ ని అనుకరించినంత మాత్రాన అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ సినిమా తయారు కాదు. తమిళంలో రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి.
ఎవరెవరు…
నటీనటులు: కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్, రావు రమేశ్, రాంకీ, గిరిధర్, లక్ష్మణ్, తదితరులు
సంగీతం: చైతన్ భరద్వాజ్
కళ: రఘు కులకర్ణి
కూర్పు: ప‌్రవీణ్ కె.ఎల్
చాయాగ్రహణం: రామ్
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ
దర్శకత్వం: అజయ్ భూపతి