రెడ్డి గారు పోయాక… (‘నవాబ్’ మూవీ రివ్యూ)

- Advertisement -

nawab-movie

అప్పట్లో వర్మ గారు  ‘రెడ్డి గారు పోయారు’ అనే టైటిల్ తో సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టి టైటిల్ స్దాయిలోనే ఆపేసారు. రాజకీయాల్లో ఒంటి చేత్తో చక్రం తిప్పే ఓ పెద్దాయన హఠాత్తుగా చనిపోతే… ఖాళీ అయిన సీఎం సీటు దక్కించుకోవడం కోసం జరిగిన పరిణామాలు, బయట పడ్డ కుంభ కోణాలు,కుట్రలు ,కుతంత్రాలతో ఈ సినిమా ప్లాన్ చేసారు. నవాబ్ సినిమా గురించి  చెప్పటానికి ‘రెడ్డి గారు పోయారు’కి లింకేంటి అంటే… నవాబ్ సినిమా చూస్తూంటే…ఆ టైటిలే  గుర్తు వచ్చింది.. ఎందుకలా…

కథేంటో చూద్దాం..

రాష్ట్ర రాజకీయాలనే శాసించే మాఫియా లీడర్‌ భూపతి రెడ్డి (ప్రకాశ్‌ రాజ్‌).  wedding anniversary కి   తన భార్య లక్ష్మి(జయసుధ)తో కలిసి గుడికి వెళ్లి వస్తూంటే..పోలీస్ వేషంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాంబ్ లతో  ఎటాక్ చేస్తారు. సరైన టైమ్ లో డాక్టర్స్ ఇచ్చిన  ట్రీట్మెంట్ తో బ్రతికి బయిటపడతారు.  అయితే తనపై ఎటాక్ చేయించింది ఎవరు. తన చిరకాల ప్రత్యర్ది  చిన్నప్ప గౌడ్‌ ? (త్యాగరాజన్‌) అయ్యింటాడా. ఇదే అనుమానంతో పెద్దాయన కొడుకులు వెళ్లి చిన్నప్ప గౌడ్ కు వార్నింగ్ ఇస్తారు. ఆయన అల్లుడుని లేపేస్తారు.

ఇంతకీ పెద్దాయన కొడుకులు ఏం చేస్తూంటారు..అంటే  పెద్దవాడు వరద(అరవిందస్వామి) చెన్నై లోని వ్యవహారాలను చూస్తూ తండ్రికి రైట్ హ్యాండ్ లా  ఉంటాడు. రెండోవాడు త్యాగు(అరుణ్‌ విజయ్‌ దుబాయ్‌లో నూ, మూడవవాడు .. రుద్ర(శింబు) సెర్బియాలో ఆయుధాల వ్యాపారం చేస్తూంటాడు. తండ్రి కోలుకున్నాడని ఇద్దరు కొడుకులూ తమ వ్యాపారాలు చూసుకోవటానికి వెళ్లిపోతారు.

nawab-movie1

కానీ పెద్దాయన మాత్రం..తనని లేపేయాలని ప్లాన్ చేసింది ఎవరు అనేది అర్దం చేసుకుంటాడు. ఆ విషయం  ఆ రాత్రి తన భార్యకు చెప్తాడు. నీ కొడుకుల్లో ఒకరు అని క్లారిటి ఇస్తాడు. ఆ కొడుకు ఎవరనేది చెప్తానంటే ఆ తల్లి మనస్సు వినటానికి ఇష్టపడదు. ఆమె ఆ బెంగలో ఉండగానే.. తెల్లారేసరికి  భూపతి రెడ్డి హార్ట్ ఎటాక్ తో చనిపోతాడు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది.

పెద్దాయన భూపతి రెడ్డికి అసలైన వారసుడు ఎవరు…ఆయన  తర్వాత  ఆ సీట్ లో ఎవరు కూర్చోవాలి. కొడుకులు ముగ్గురుకి ఆశ ఉంటుంది. ఎవరు ముందు ఎత్తు వేసి , ఎదుటివారికి చెక్ చెప్తే …వారిదే గెలుపు. ఆట మొదలవుతుంది. మరో ప్రక్క పెద్దాయన పై ఎటాక్ చేసిన కొడుకు ఎవరు అనే విషయం క్లారిటి వస్తూంటుంది. ఇంతకీ ఎవరా కొడుకు..ఫైనల్ గా ఈ కుర్చీ ఆటనలో ఎవరు గెలుస్తారు.  ఈ సినిమాలో మొదట నుంచి చివరి వరకూ ఉండి కథలో కీలకమైన మలుపులు తెచ్చే  రసూల్‌(విజయ్‌ సేతుపతి)  పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందీ అంటే…

ఆస్తుల కోసం అన్నదమ్ములు ఒకరినొకరు కొట్టుకోవటం,కేసులు పెట్టుకోవటం, చంపుకోవటం మన సమాజాల్లో చాలా కామన్. అలాంటిది ఆధిపత్యం కోసం అంటే ఆ పోరు ఏ స్దాయిలో ఉంటుంది…అదే మణిరత్నం తన తాజా చిత్రంలో స్పృశించాడు. చాలా కాలంగా సరైన సక్సెస్ లేక వెనకబడ్డ ఆయన తన మ్యాజిక్ తో మెరిసారు.  అయితే ఫస్టాఫ్ లో ఉన్నంత స్పీడు సెకండాఫ్ లో కొరవడింది.

అందుకు కారణం ఫస్టాఫ్ అంతా…తన తండ్రిపై ఎటాక్ చేసిన వారికోసం అన్వేషణ, దొరికిన వారిని వేటాడటం  వంటి సీన్స్ ఉండటంతో రేసీగా ఉంటుంది. సెకండాఫ్ కి వచ్చేసరికి.. పెద్దాయన మీద ఎటాక్ చేసిందెవరో అనే యాంగిల్ మారి, ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆదిపత్యపు పోరు అయ్యింది. దాంతో అక్కడక్కడే కథ తిరిగినట్లు అనిపించింది. ఎవరు హీరో, ఎవరు విలన్ అనేది లేకుండా ఒకరి మీద మరొకరు ఎటాక్ లతో సాగింది. దాంతో చూసేవారు ఆ ముగ్గురు కొడుకుల్లో ఎవరిని ఐడింటిఫై చేసుకుని ముందుకెళ్లాలో తెలియదు. కేవలం డైరక్టర్ చూపే సీన్స్ తో ముందుకు వెళ్లటమే.

‘పోకిరి’ ట్విస్ట్…

ఇక ఈ సినిమా క్లైమాక్స్ ..అదరకొట్టే విజువల్స్ తో అవుట్ స్టాండింగ్ గా ఉన్నా…పోకిరి టైప్ ట్విస్ట్ …నీరు గార్చింది. అసలు అలాంటి ట్విస్ట్ లేకుండా ఉండి ఉంటే బాగుండేది. ఫైనల్ గా ఎవరూ హీరో కాకుండా తేల్చేస్తే …కేవలం మణిరత్నం మాత్రమే హీరో అయ్యేవారు. అలా కాకుండా చివర్లో ఇచ్చిన ట్విస్ట్ నాకైతే పర్శనల్ గా నచ్చలేదు. అఫ్ కోర్స్ ఆ ట్విస్ట్ కొంతమందికి థ్రిల్ ఇచ్చి ఉండవచ్చు.

కాపీ కాదు, ప్రేరణ…

కొరియా సినిమా New World (2013 film)ప్రేరణతోనే ఈ స్క్రిప్టు మణిరత్నం రాసుకున్నారని ఇట్టే అర్దమవుతుంది. అయితే మణిరత్నం ఎక్కడా మన నేటివిటిని (తమిళమే) మిస్ కాకుండా మాయ చేసారు. ఉన్నదున్నట్లు యాజటీజ్ దింపేయకుండా …కేవలం ప్రేరణ పొందారనే అర్దమవుతుంది. కానీ న్యూ వరల్డ్ చూసినవారికి ఈ సినిమా రెండో చూసినట్లు అనిపిస్తుంది కథా పరంగా.. ఏం చెయ్యలేం దానికి.

టెక్నికల్ గా…

మణిరత్నం సినిమాలో టెక్నికల్ బ్రిలియెన్స్ గురించి మాట్లాడటం అంటే కొండని అద్దంలో చూపించటమే. తెలుగు డబ్బింగ్ బాగుంది. రహమాన్, మణి కాంబో మ్యాజిక్ మాత్రం మిస్సైంది. అలాగే  పూర్తి మణి రత్నం సినిమాలా అనిపించలేదు. ఆయన తరహా భావోద్వేగాలు మిస్ అయ్యాయి. ఖచ్చితంగా చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ తీసిన మణి సినిమాలాగో లేదా మణిరత్నం తీసిన రామ్ గోపాల్ వర్మ సినిమాలాగో ఉంది. ముఖ్యంగా క్యారక్టర్స్ డైనమిక్స్ విషయంలో…

నటుల్లో..

అందరూ బాగా చేశారు. కానీ విజయ్ సేతుపతి మాత్రం అద్భుతంగా చేశారు.

mani-ratnamమణిరత్నం సార్ ఈజ్ బ్యాక్…

వరస ప్లాప్ ల్లో ఉండటం వల్ల బ్యాక్ అంటున్నాం కానీ ..నిజానికి ఈ స్దాయి సినిమాలను మించి మణి రత్నం ఎప్పుడో చేసేసారు. సక్సెస్ పరంగా వెనకబడ్డాం కదా అని టెక్నాలిజీ, స్క్రిప్టు విషయాల్లో ఆయన వెనకబడలేదు. ఔత్సాహిక దర్శకులు తన వెనకపడేలాగ చేసుకున్నారు.

ఫైనల్ థాట్…

హిట్ కోసం  మణిరత్నం….వర్మ అవతారం ఎత్తాల్సివచ్చింది.  మరి వర్మగారు …

nawab-aravindతారాగణం…

నటీనటులు: అర‌వింద స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, త్యాగ‌రాజ‌న్, అదితి రావు‌ హైదరి త‌దిత‌రులు
సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
ఛాయాగ్ర‌హ‌ణం: స‌ంతోశ్ శివ‌న్
కూర్పు: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రాకేందు మౌళి
మాట‌లు: కిర‌ణ్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ‌ర్మిష్ట రాయ్‌
ఫైట్స్: దిలీప్ సుబ్బరాయ‌న్‌
ర‌చ‌న‌: మ‌ణిర‌త్నం, శివ ఆనంది
నిర్మాత‌లు: మ‌ణిర‌త్నం, సుభాష్ క‌ర‌ణ్
ద‌ర్శ‌క‌త్వం: మ‌ణిర‌త్నం
స‌మ‌ర్ప‌ణ‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్
ప‌తాకం: మ‌ద్రాస్ టాకీస్‌

josyula surya prakash

-సూర్యప్రకాష్ జోశ్యుల

- Advertisement -