షేర్ మార్కెట్ చీకటి కోణాలు బట్టబయలు.., సైఫ్ అద్భుత నటన.. (‘బజార్’ మూవీ రివ్యూ)

- Advertisement -

baazaar-movie-still

ఈ ప్రపంచంలో అందరూ అనే మాట.. ‘అంత అత్యాశ పనికి రాదు’. కానీ ఇక్కడ నిర్భయంగా, నిర్లజ్జగా మాట్లాడాలంటే కావల్సింది.. ‘అత్యాశ’ మాత్రమే..

రాత్రికి రాత్రే గొప్పవాళ్లయిపోవాలనుకే వాళ్లు,

డబ్బులు, ప్రాణాలు పణంగా పెట్టి ఆడే ఆట ఇది..

ఈ అత్యాశ..విలువ ఎంతో తెలుసా..?  కొన్ని లక్షల కోట్లు..

ప్రపంచ దేశాలే ప్రజలతో దగ్గరుండి మరీ ఆడించే..

ఇదో లైసెన్స్ డ్ మనీ గేమ్.. దీనికి ఉన్న మరో అందమైన పేరు..

‘షేర్ మార్కెట్..

ఒకప్పుడు మనం లాటరీ టిక్కెట్లు కొనేవాళ్లను చూసేవాళ్లం.. రూపాయి పెట్టి లాటరీ టిక్కెట్టు కొంటే.. లక్ష రూపాయలు వస్తుంది.. అది ఆశ..              ‘పోతే రూపాయి పోతుంది.. వస్తే లక్ష వస్తుందిగా..’ అనేవాళ్లు.

అదే పది రూపాయలు పెట్టి కొంటే.. కోటి రూపాయలు వస్తుందటే.. ఇది అత్యాశ..

కోట్ల రూపాయలతో కోడి పందాలు ఆడుతుంటారు. కేవలం బరిలో దిగిన రెండు కోళ్లు.. సమయం.. 20 నిమిషాలు మాత్రమే..                                అప్పుడు  ఏదో కోడి పడిపోతుంది. వందలు, వేల రూపాయలు చేతులు మారిపోతాయి.  ఇది ఆశ..

కానీ అంతకన్నా వేగంగా డబ్బులు రావాలి.. అందుకే కోడి కాళ్లకు పదునైన కత్తులు కడతారు. ఇప్పుడు  ఆట సమయం.. సగానికి సగం పడిపోతుంది. అంటే పదినిమిషాల్లో ఏదో కోడి కత్తి గాటుకు బలైపోతుంది. ఇక్కడ ఒక్కో బరిలో..కలిపి లక్షలు, కోట్ల రూపాయలు అటూ ఇటూ వెళ్లిపోతుంటాయి.  ఇది  అత్యాశ..

మూడోది పేకాట (గ్యాంబ్లింగ్).. ఒక పది నిమిషాలు చాలు.. ఆట కొడితే చిన్నవాళ్లయితే వెయ్యి రూపాయలు.. అదే పెద్దవాళ్లయితే లక్షలు, కోట్లు..  వీటన్నింటికి కారణం.. చెబితే ఒప్పుకోరు.. కానీ నిజం  ఏమిటంటే.. కష్టపడకుండా డబ్బులు రావాలి.. దానికి ఈ బజార్ సినిమాలో పెట్టిన పేరే..

అత్యాశ..

ఆ అత్యాశ ఉన్నవాళ్లు.. దీనికి ఒక అందమైన ముసుగు కప్పి సంక్రాంతి పండగల పేర్లు చెప్పి పరుగులు పెడుతుంటారు. దానికి సంప్రదాయమని ఒక ముసుగేస్తారు. అయితే అక్కడ ముసుగులు అక్కర్లేదు. స్టాక్ మార్కెట్లు పేరు చెప్పి.. స్టైల్ గా పరుగులు తీస్తుంటారు.

ఈ స్టాక్ మార్కెట్ గురించి  మొహమాటం లేకుండా చెప్పాలంటే.. అత్యాశ ఉన్నవాళ్లు మాత్రమే ఇక్కడ పెట్టుబడులు పెడుతుంటారు. త్వరగా డబ్బులు వచ్చేయాలి..ఓవర్ నైట్ లో  రూపాయికి పది రూపాయలు రావాలి..అనుకున్నవాళ్లు ఇక్కడకు వస్తుంటారు. ఇది బజార్ కాదు.. పెద్ద మాయా బజార్ అంటే సరిపోతుంది.

మనకు తెలియకుండానే.. ఈ బజార్ వెనుక పెద్ద చీకటి బజార్ ఒకటి నడిపిస్తుంటుంది.   తాగుడు అలవాటు ఉన్నవాడు..పొద్దున్న వైన్ షాపు ఓపెన్ చేయకుండానే తలుపు దగ్గర నిలుచున్నట్టు.. షేర్ మార్కెట్ పిచ్చి ఉన్న కోట్లాదిమంది.. పొద్దున్నే ముఖం కూడా కడుక్కోకుండా టీవీల ముందు కూర్చుని స్టాక్ మార్కెట్ అంకెలు చూస్తూ దినచర్యను ప్రారంభిస్తుంటారు.

ఉదయం ఒక కూలి పనికి వెళ్లి రోజంతా పనిచేస్తే రూ.500 వస్తుంది.. అదే వంద రూపాయలు పట్టుకొని.. ఈ షేర్ మార్కెట్ దగ్గర రోజంత క్యారేజ్ పట్టుకెళ్లి కూర్చుంటే.. ఉదయం ఓపిినింగ్, సాయంత్రం క్లోజింగ్ దగ్గర చూసుకుంటే రాత్రికి రూ.1000 తో  ఒక క్వార్టర్ బాటిల్, ఒక చికెన్ బిర్యానీ ప్యాకెట్ తో చక్కగా ఇంటికెళ్లిపోవచ్చు..లేదంటే పోయేది రూ.100 మాత్రమే..

ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.. కానీ ఆడేది మాత్రం ఈ ఫార్ములాపైనే.. కానీ నేను చెప్పింది రూ.100 రూపాయలే.. కానీ అక్కడ కట్టేది  వేలు, లక్షలు , లేదా కోట్లు.. కొందరు ఒకరోజు మాత్రమే ఉంచుతారు. కొందరు వారం రోజులు, కొందరు పది రోజులు, కొందరు నెలరోజులు.. ఇలా అదృష్టం, దురదృష్టం ఒక్కరాత్రిలో మారిపోతుంటుంది.

అయ్యో.. నిన్ననే అమ్మేసుకుంటే ఎంత బాగుండేది రా.. అని లబోదిబో అనేవాళ్లు ఎంతో మంది.. అయితే మనం పెట్టుబడి పెట్టిన కంపెనీ నష్టాల్లో ఉంటే.. ఆ షేర్ అమ్మేసుకోవడానికి ఉండదు..ఎందుకంటే ఇంకొకడు కొనాలి. కోడి పందాలు  ఆడుతుంటే చుట్టూ ఉన్నవాళ్లు పై పందాలు కాసినట్టే.. ఒకడు కంపెనీ పెట్టి.. ప్రజల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తాడు.

ఇప్పుడు ఎవరైతే షేర్ హోల్డర్ ఉన్నాడో.. అతను మళ్లీ అమ్ముకుంటానంటే కంపెనీ తీసుకోదు..బయట నుంచి ఎవరైనా వస్తేనే విక్రయించగలం. లేదంటే తక్కువ ధరకి ఇవ్వాలి.. అంటే ఇదంతా ఆట ఒకరు ఆడుతుంటారు. దీనిపై ప్రజలు మాత్రమే  పై పందాలు  కాస్తుంటారు. అయితే మనం దినపత్రికల్లో చూస్తుంటాం..

‘కుప్పకూలిన స్టాక్ మార్కెట్’.. ‘లక్ష కోట్లు ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరి’.. ‘బేర్ మన్న షేర్ మార్కెట్’..

‘ఇది స్టాక్ మార్కెట్ చరిత్రలోనే చీకటి రోజు’..

చాలామందికి తెలీదు. మన డబ్బులు ఆవిరైపోవడమేమిటి? అమెరికాలో యుద్ధం వస్తే..ఇండియాలో స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపడం, అక్కడ పెట్రోలు ధరలు పెరిగితే.. అది షేర్ మార్కెట్ షేక్ అయిపోవడం.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఒకలా పెరిగి, కాంగ్రెస్ వస్తే మరోలా పెరిగి.. లక్ష కోట్లు ఆవిరైపోతే ఎక్కడికి పోయాయి? ఇవేవీ ఎవరికి తెలీవు.  కానీ హర్షద్ మెహతా లాంటి వాళ్లు ఆడించిన ఎన్నో ఆటలు, చేసిన చీకటి మోసాలు ఇప్పుడింకా పెరిగిపోయాయి. వాటిని పట్టి చూపించిన సినిమా ఈ..’ బజార్’..

కథ విషయానికి వస్తే.. రిజ్వన్ అహ్మద్ (రోషన్ మెహ్ర..ఒకప్పటి రోమాంటిక్ హీరో వినోద్ మెహ్రా తనయుడు)..అలహాబాద్ లోని ఒక చిన్న ఊరిని వదిలి.. ఎన్నో ఆశలతో, త్వరగా డబ్బులు సంపాదించి గొప్పవాడినైపోవాలని ఆకాశంలో మేడలు కట్టుకొని.. ముంబయి వస్తాడు. అతనికి ఇన్సిపిరేషన్ శకున్ కోఠారి (సైఫ్ ఆలీ ఖాన్).. అతని దగ్గర పనిచేయాలని భావిస్తాడు. అక్కడ డబ్బులనేవి ఎలా చేతులు మారుతుంటాయి.. ఎంత కీలకంగా మారుతాయి..సెటిల్ మెంట్లు, మాఫియా కల్పించుకోవడం, అక్కడ ఉండే అత్యాశపరులు, అధికారం ఎలా పనిచేస్తుంది, పవర్ గేమ్, డాబు, రుబాబు, దర్పం, హంగు, హడావుడి ఇవన్నీ చూస్తాడు.

డబ్బుల కోసం ఎన్నో కుతంత్రాలు

ఇక్కడ అత్యాశ ఉన్నవాడే.. గెలుస్తాడు.. బతుకుతాడు..నీతులు చెప్పేవాడికి చోటు లేదు లాంటి ఎన్నో మంచి డైలాగులున్నాయి. ఒక దగ్గర డబ్బులు పెట్టి దాని ధర పెంచేలా చేయడం, కొందరు శతృవులతో కలిసి కొన్ని కంపెనీల షేర్లు పడగొట్టేయడం, కొన్ని కంపెనీలే కావాలని లాభాలు ఇన్వెస్టర్లకి ఇవ్వకుండా చూడటం.. ఒకటి కాదు..ఎన్నో మోసాలు, కుట్రలు.. ఒక అత్యంత ఘోరమైన విషయమేమిటంటే.. ప్రజల సొమ్ముతో అక్కడ సరదాగా ఆటలాడుతుంటారు. పోయేవాడివి పోతుంటాయి.. వచ్చేవాడివి వస్తుంటాయి..అయితే బయటకు చెప్పుకోవడానికి మాత్రం ఘనంగా ఉంటుంది. పేకాట అంటే అతన్ని ఒక జూదరిలా చూస్తారు. కోడి పందాలంటే వ్యసనపరుడిలా చూస్తారు.

కానీ ఇక్కడ షేర్ మార్కెట్ అంటే గౌరవంగా చూస్తారు. అదే తేడా..

స్టాక్ బ్రోకర్స్, పవర్ బ్రోకర్స్, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడులు పెట్టేవారు, అధికారం ఉన్న ప్రముఖులు, ముంబయి మాపియా ఇలా  ఎందరో చెప్పుచేతల్లో ఇది వారికి కావల్సినట్టుగా నడుస్తుంటుంది.  గుర్రపు పందాలులు జరుగుతుంటాయి. అక్కడా ఇలాగే కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. కానీ వెనుక ఎన్నో మోసాలుంటాయి. ఇదీ అలాంటిదే..

ప్రపంచంలో క్షణక్షణానికి జరిగే పరిణామాలతో.. రూపాయి చితికిపోవడమో, తిరిగి మళ్లీ పెరిగిపోవడమో..అప్పటికప్పుడే జరిగిపోతుంటుంది. క్షణం ముందు నువ్వు గొప్పోడివి.. క్షణం తర్వాత ఏమీలేని బికారివి.. ఇలా పబ్లిక్ గా పేద, మధ్య తరగతి ప్రజల సొమ్ములతో ఆడే ఆటకు వేదికే..

బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఊపేస్తోన్న ‘బజార్’…

చాలాకాలం తర్వాత సైఫ్ ఆలీ ఖాన్.. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చేసిన సినిమా.. ఈ ‘బజార్..’ ఇప్పుడు బాలీవుడ్‌ని బాక్సాఫీస్ వద్ద ఊపేస్తున్న ఈ సినిమా.. కలెక్షన్ల  కనక వర్షం కురిపిస్తోంది. మొదటిరోజే అద్భుతమైన టాక్ తో అదరగొడుతోంది. ఫక్తు ప్యామిలీ కథలకు, వీర ప్రేమగాథలకు అలవాటు పడిపోయిన ప్రేక్షకులకు ఇది ఒక కొత్తదనాన్ని అందిస్తుంది.

ఇందులో సైఫ్ ఆలీఖాన్ నటన సినిమాకి హైలైట్ గా చెప్పాలి.  అతను గుజరాతీలా నటించాడు. ఆ మాటల్లో కూడా కొంత వారి యాసను అనుకరించాడు. అదీ గొప్పగా పలికించాడు. ముఖ్యంగా ఆ గెటప్ సూపర్.. పెర్ఫార్మెన్స్ ఇక చెప్పాల్సిన పని లేదు. సైఫ్ సెలక్షన్ కొన్ని సందర్భాల్లో చాలా బాగుంటుంది. ఇది కూడా అతని కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా చెప్పాలి. 1987లో హాలీవుడ్ సినిమా మైఖేల్ డగ్లస్ నటించిన ’ వాల్ స్ట్రీట్‘లో  డబ్బు..డబ్బు.. డబ్బు చుట్టూ ప్రపంచం ఎలా తిరుగుతుందో, దానినెంత పవర్ ఫుల్ గా చూపించారో.. ఈ సినిమా కూడా దానికే మాత్రం తీసిపోనట్టుగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. సైఫ్ ఆలీఖాన్.. నటనే.. తనే అన్నీ అన్నట్టు అద్భుతంగా చేశాడు..సినిమానంతా తన భుజ స్కంధాలపై మోశాడు. అతని హెయిర్ స్టయిల్ ను.. కొంచెం కలర్ షేడ్ మార్చి..చూపించడంతో ఒక హ్యాండ్ సమ్ పర్సనాలిటీ కనిపించింది. అంతేకాదు..అతనీ వయసులో కూడా అంత ఫిట్ నెస్ తో ఉండటం.. ఒక గొప్ప విషయంగా చెప్పాలి.

ఒకప్పుడు వచ్చిన *సలామ్ నమస్తే@, ’హమ్ తుమ్‘ లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల కోవలోకే ఇదీ వస్తుందని బాలీవుడ్ సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక విషయానికి వస్తే..సెకండాఫ్ లో సినిమా చాలా పీక్ కి వెళ్లిపోతుంది. కొన్ని ప్రేక్షకుడు ఊహించని ట్విస్టులు, మలుపులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అక్కడ  సైఫ్ నటన కూడా అద్భుతంగా కుదిరింది.

ఎందుకంటే ఈ సినిమాని ఒక క్రైం థ్రిల్లర్ లా తీయడంతో.. ప్రేక్షకులను ఊపిిరి బిగపట్టి చూసేలా తీశారు. ఇప్పటికి కూడా చాలామందికి  షేర్ మార్కెట్ అంటే ఏమిటో తెలీదు..ఈ సినిమా చూస్తే మొత్తం తెలిసి పోతుంది.

ప్రొడక్షన్ డిజైనర్ గా  పనిచేసిన  శృతి గుప్తా..  దలాల్ స్ట్రీట్ సెట్ ని అద్భుతంగా వేశారు.

థ్రిల్లర్ సినిమా చూసినట్టుగా వినిపించే ప్రత్యేకమైన బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ ని.. జాన్ స్టీవార్ట్ సమకూర్చారు.

డైరెక్టర్ గౌరవ్ చావ్లా.. సినిమా మొత్తాన్ని.. ఎక్కడా బోర్ కొట్టకుండా..మొదలైన దగ్గర నుంచి చివరి వరకు ఒకే టెంపోతో కొనసాగించడం విశేషం.

అశీమ్ అరోరా, పర్విన్ షేక్ కథ అందించారు. రోహన్ మెహ్రా ఈ సినిమాతోనే పరిచయమయ్యాడు. ఒకప్పటి బాలీవుడ్ ప్రముఖ నటుడు వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రా మొదటి సినిమా ఇది..చాలా బాగాచేశాడు. ఈజీగా నటించాడు. ఎక్కడా కంగారు పడలేదు. రాధికా ఆప్టే ఒక యువ కాంపిటేటివ్ స్టాక్ బ్రోకర్ గా చక్కగా నటించింది.

ఇక చిత్రాంగద సింగ్, మానిష్ చౌదరివిలు కనిపించేది కొద్ది సేపు అయినా ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. మొత్తానికి చాలా కాలం తర్వాత మళ్లీ ఒక కొత్తదనంతో కూడిన వినూత్నమైన సినిమా చూసిన భావన కలుగుతుంది. ‘బజార్’ గొప్పవాళ్లమని చెప్పుకుంటూ ఖరీదైన కార్లు, బంగళాలు, ఫ్యాక్టరీలు కటి కోట్లాది రూపాయల వ్యాపారాలు చేస్తూ.. ప్రజల సొమ్ముతో ఎలా ఆటలాడుతున్నారో తెలియజెప్పిన గొప్ప సినిమా..

  • -శ్రీనివాస్ మిర్తిపాటి

- Advertisement -