పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధ మూడో విజయాన్నినమోదు చేసుకుంది. ఆదివారం పట్నాలో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో యూపీ యోధ 38-36 తేడాతో దబాంగ్ ఢిల్లీపై గెలిచింది. మొదటి నుంచి చివరి వరకు ఆధిపత్యం చేతులు మారుతూ ఆద్యంతం ఆసక్తిగా సాగిన మ్యాచ్‌లో చివరికి యోధదే పైచేయి అయింది.
రైడింగ్‌లో శ్రీకాంత్ జాదవ్ 12 పాయిట్లు, ట్యాక్లింగ్‌లో నితేష్ కుమార్ 4 పాయింట్లు రాణించి ఆ జట్టుకు విజయన్ని అందిచారు. మరోవైపు ఢిల్లీ తరపున నవీన్ కుమార్ 12 పాయింట్లతో మెరిసినా ఫలితం లేకపోయింది. యూపీ యోధ, దబాంగ్ ఢిల్లీ హోరాహోరీగా తలపడడంతో స్కోర్లు 6-6, 8-8, 10-10 ఇలా సమం అవుతూ వచ్చాయి. ఆ తర్వాత విజృంభించి ఆడిన యోధ ఆటగాళ్లు ఢిల్లీ జట్టుని రెండుసార్లు ఆలౌట్ చేసి తొలి అర్ధభాగం ముగిసేసరికి 25-17తో ఆధిక్యాన్ని సాధించారు.
యూపీ యోధ విరామం తర్వాత కూడా అదే జోరు కొనసాగించి ఓ దశలో 30-22తో నిలిచింది. అయితే చివర్లో పుంజుకున్న దబాంగ్ ఢిల్లీ జట్టు.. యోధను ఆలౌట్ చేసి 31-31తో స్కోరు సమం చేసింది. ఆట చివరి పది నిమిషాలలో రెండు జట్ల ఆటగాళ్లూ ఒకరితో మరొకరు పడి మరీ పాయింట్లు సాధించారు.
దాంతో ఇంకా మూడు నిమిషాల ఆట మిగిలుండగా 35-35తో నిలిచిన రెండు జట్లు మ్యాచ్‌ను టైగా ముగించేలా కనిపించాయి. కానీ నవీన్ కుమార్ పాయింటు తెచ్చి ఢిల్లీకి ఆధిక్యాన్ని అందించాడు. చివరి నిమిషంలో ఒక పాయింటు ఆధిక్యంలో నిలిచిన ఢిల్లీ విజయం దిశగా దూసుకెళ్లింది. కానీ అప్పుడే రైడ్‌కు వెళ్లిన శ్రీకాంత్ జాదవ్ రెండు పాయింట్లు తీసుకురావండం .. ఆ తర్వాత ఢిల్లీ రైడర్‌ను పట్టేయడంతో గెలుపు యూపీ యోధ వశం అయింది.
మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 43-32తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది.