

అహ్మదాబాద్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇప్పుడు ఈ-కామర్స్ రంగంపై దృష్టిసారించారు. ఇప్పటికే చమురు, టెలికాం రంగాల్లో అద్భుతాలు సృష్టించిన ముకేశ్ అంబానీ.. త్వరలోనే జియో, రిలయన్స్ రిటైల్ కలిసి సరికొత్త ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తాయని ప్రకటించారు.
శుక్రవారం జరిగిన ఉజ్వల గుజరాత్ ప్రపంచ సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ ప్రకటించారు. మొదటగా గుజరాత్‌లోని 12 లక్షల మంది రిటైలర్లు, స్టోర్ యజమానుల కోసం ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను తీసుకు రానున్నట్లు అంబానీ వివరించారు.
అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు ధీటుగా..
తమ జియో స్టోర్లు, రిటైల్ నెట్‌వర్క్‌ను ఇందుకు ఉపయోగించుకుంటామని తెలిపారు. దీంతో దేశీయ ఆన్‌లైన్ విపణిలో అమెరికా దిగ్గజం అమెజాన్ అనుబంధ అమెజాన్ ఇండియా, మరో దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్ ఆధీనంలోని ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా దేశీయంగా మరో అగ్రశ్రేణి సంస్థ ప్రవేశించినట్లవుతుంది.
ప్రస్తుతం జియోకు 28 కోట్ల మంది వినియోగదార్లుండగా.. రిలయన్స్ రిటైల్ సంస్థకు దేశంలోని 6,500 నగరాలు, పట్టణాల్లో దాదాపు 10,000 విక్రయ కేంద్రాలున్నాయి. జియో ఆప్‌లు, మొబైల్ ఫోన్ల ద్వారా విక్రయదార్లను అనుసంధానం చేస్తామని రిలయన్స్ రిటైల్ ఉన్నతాధికారి సుబ్రమణియన్ ఇప్పటికే ప్రకటించారు. కాగా, గుజరాత్ సదస్సులో పాల్గొన్న అంబానీ.. వివిధ రంగాల్లో ఆ రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలిపారు.








