ముంబై: దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం టాటా గ్రూప్‌నకు చెందిన సర్‌ దోరబ్‌జీ టాటా ట్రస్ట్‌కు ఐటీ శాఖ మినహాయింపును రద్దు చేసింది. డిసెంబర్‌ 31న తీసుకొన్న ఈ నిర్ణయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మినహాయింపులు పొందేందుకు పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించడంతో ఐటీ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్రస్ట్‌లోని ట్రస్టీ సభ్యుడు ఆర్‌ వెంకటరమణన్‌కు పరిహారం చెల్లింపు విషయంలో ఉల్లఘనలు చోటు చేసుకొన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఐటీ చట్టంలో పేర్కొన్న మొత్తాన్ని మించి పరిహారం ఇచ్చినట్లు తెలిసింది. ఐటీశాఖ ఆదేశాలను టాటాలు సవాలు చేసినట్లు సమాచారం.

అసలేం జరిగిందంటే..

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 11 కిందకు ట్రస్ట్‌లు, ఇతర ధార్మిక సంస్థలకు సంబంధించిన మినహాయింపులను వస్తాయి. దీనికి సంబంధించి మినహాయింపులను పరిశీలించే అధికారం ఐటీశాఖ అధికారులకు ఉంటుంది. దోరబ్‌జీ టాటా ట్రస్ట్‌ బోర్డు సభ్యుడైన ఆర్‌. వెంకటరమణన్‌కు 2015-16 సంవత్సరానికి రూ.2.5 కోట్లు పరిహారంగా చెల్లించినట్లు గుర్తించింది. దీనిని అధిక మొత్తంగా భావించింది. దీనిపై ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే, ట్రస్ట్ నుంచి వచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో మినహాయింపును రద్దు చేసింది.

కాగా, టాటాలకు ఉన్న ట్రస్టుల్లో సర్‌ దోరబ్‌జీ టాటా ట్రస్ట్‌, రతన్‌టాటా ట్రస్ట్‌ పెద్దవి. వీటి మొత్తం టాటా సన్స్‌లో దాదాపు 66 శాతం వాటా కలిగి ఉన్నాయి. టాటా గ్రూప్‌ మొత్తానికి ‘టాటా సన్స్‌’ హోల్డింగ్‌ కంపెనీగా వ్యవహరిస్తోంది. దోరబ్‌జీ టాటా ట్రస్ట్‌కు రతన్‌ టాటా ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.


English Title:

income tax department withdraws tax exemptions for sir dorabji tata trust says report