సుశాంత్ అంత్యక్రియల్లో ఆ దృశ్యాలు చూసి నా గుండె పగిలింది: వివేక్ ఒబెరాయ్…

- Advertisement -

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంత్యక్రియల్లో పాల్గొన్న వివేక్ ఒబెరాయ్ అక్కడ చోటుచేసుకున్న దృశ్యాలు, హృదయ విదారక ఘటనల గురించి ఓ ట్వీట్‌లో ప్రస్తావిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

సోమవారం సుశాంత్ అంత్యక్రియల్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాలీవుడ్ ప్రముఖులు పాల్గొని ఆయనకు తుది వీడ్కోలు పలికారు.  

వివేక్ ఒబెరాయ్, శ్రద్ధా కపూర్, కృతి సనన్, ముఖేష్ చబ్రా, రణ్‌దీప్ హుడా తదితరులు వర్షంలోనే తడుస్తూ నిలబడ్డారు. 

ఈ నేపథ్యంలో అక్కడి ఘటనలపై వివేక్ ఒబెరాయ్ తన మనోభావాలను వ్యక్తం చేస్తూ.. సుశాంత్ తండ్రి కళ్లల్లో కనిపించిన బాధ భరించలేనిదంటూ పేర్కొన్నారు. 

‘‘సుశాంత్ అంత్యక్రియల్లో పాల్గొన్నా.. అక్కడి దృశ్యాలు నా మనసును బద్ధలు చేశాయి.. ఆ బాధను మీతో పంచుకోవాలని అనుకున్నా..’’ అని తెలిపారు.

జీవితం అనే ఈ ప్రయాణంలో తాను కూడా ఒంటరితనాన్ని, చీకటిని అనుభవించానని వివేక్ పేర్కొన్నారు. అయితే దానికి చావు పరిష్కారం కాదని, ఆత్మహత్య సమాధానం కాదని అన్నారు.

‘‘సుశాంత్ తనను ప్రేమించే కుటుంబ సభ్యుల గురించి, అభిమానించే స్నేహితులు, కోట్లాది మంది అభిమానుల గురించి ఆలోచించి ఉండాల్సింది.. ఆత్మహత్యకు పాల్పడకుండా ఉండాల్సింది..’’ అంటూ వివేక్ ఒబెరాయ్ ఆ ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘కుమారుడి చితికి నిప్పు పెడుతున్నప్పుడు సుశాంత్ తండ్రి కళ్లల్లో కనిపించిన బాధ వర్ణించలేనిది. అతడి సోదరి భోరుమంటూ.. ‘సుశాంత్ వెనక్కి వచ్చేయ్..’ అంటూ పదే పదే అరవడం చూడలేకపోయాను..’’ అంటూ వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు.

అంతేకాదు, ‘‘ సుశాంత్.. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే నిన్ను మిస్ అవుతున్నా.. నీ బాధని ఆ దేవుడు తగ్గించాలని ప్రార్థిస్తున్నా బ్రదర్.. నీవు లోటును భరించే శక్తి నీ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటున్నా.. నువ్విప్పుడు సరైన చోటులో ఉన్నావని భావిస్తున్నా.. బహుశా నీతో ఉండే అర్హత మాకు లేదేమో..’’ అని వ్యాఖ్యానించారు.

అలాగే సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కూడా వివేక్ చురకలు అంటించారు.

అవకాశం వచ్చినప్పుడల్లా మనమంతా ఒక్కటే అని ఎలుగెత్తి చాటే బాలీవుడ్ ఇకనైనా ఇలాంటి పరిస్థితులను గమనిస్తుందని ఆశిస్తున్నా అంటూ వివేక్ ఒబెరాయ్ వ్యాఖ్యానించారు. 

‘‘మనం మారాలి.. విమర్శలు తగ్గించుకుని.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నైపుణ్యాలను గుర్తించాలి, ప్రోత్సహించాలి.. చంపేయకూడదు. నటుల్ని మభ్యపెట్టకూడదు.. ఈగోలు పక్కనబెట్టి.. న్యాయంగా వ్యవహరించాలి.. ఇది మనందరికీ ఒక మేలుకొలుపు’’ అని పేర్కొన్నారు.

 

 

- Advertisement -