ముంబై: కపూర్‌ల గారాల పట్టి సోనమ్ పెళ్లి కబురు తెలిసిన దగ్గరనుంచి అభిమానుల ఎదురుచూపులు మరింత పెరిగాయి. అసలు సోనమ్ కపూర్ అంటేనే కొత్త ఫ్యాషన్‌లకు ఐకాన్‌గా చెప్పుకుంటారు. అలాంటిది ఇక వివాహమంటే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. శనివారం నుంచే కపూర్ మాన్షన్‌లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి జరిగిన మెహంది, అనంతరం జరిగిన సంగీత్ వేడుకలు ఎంత అట్టహాసంగా జరిగాయో వీటికి సంబంధించిన ఫోటోలు చూస్తేనే అర్ధం అవుతుంది. మంగళవారం ఉదయం 11 – 12.30 గంటల ప్రాంతంలో జరిగిన వివాహ తంతుతో సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా ఒక్కటయ్యారు.
గులాబీ బాల పెళ్లికి గులాబి రంగులో అలంకరించిన వివాహ వేదిక ఆహుతుల చూపులను కట్టిపడేసింది. సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకలో చక్కనమ్మ సోనమ్ దేవకన్యలకే అసూయ పుట్టించేలా ముస్తాబయింది. సోనమ్ అనురాధ వాకిల్ రూపొందించిన తామరపూవ్వులతో ఉన్నఎరుపు లెహాంగాలో దివినుంచి దిగివచ్చిన చందమామలా ఉన్నారు. వరుడు ఆనంద్ అహుజా ఒక గంట ముందే వేదిక వద్దకు వచ్చాడు. ఆనంద్ బంగారు వర్ణంలో ఉన్న షేర్వాని ధరించి మెడలో రూబీ మాలతో రాజకుమారుడికి ధీటుగా ఉన్నాడు. వీరి వివాహ వేడుక బంద్రాలో జరిగింది.
తరలి వచ్చిన బాలీవుడ్ తారాలోకం…
వీరి వివాహానికి బాలీవుడ్ తారాలోకం తరలి వచ్చింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన కుమారుడు, కూతురుతో వేడుకకు విచ్చేసారు. వీరితో పాటు కరీనా కపూర్, భర్త సైఫ్ అలీఖాన్, కుమారుడు తైమూర్ ఖాన్‌తో పాటు అక్క కరిష్మా కపూర్ కూడా వచ్చారు. సోనమ్ స్నేహితులు స్వర భాస్కర్, జాక్వేలిన్, నిర్మాత కరణ్ జోహర్, కజిన్స్ జాహ్నవి, ఖుషి కపూర్ హాజరయ్యారు. వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. ఈ రోజు సాయంత్రం నూతన వధూవరుల కోసం రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు.