విజయవాడ: రాజకీయ రాజధాని విజయవాడ పార్లమెంట్ సీటులో ఈసారి టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) పోటీ చేయగా…వైసీపీ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) బరిలో దిగారు. ఇద్దరు భారీగా ఖర్చు పెడుతూ…పోటాపోటిగా ప్రచారం చేశారు.
విజయవాడ పార్లమెంటు పరిధిలో విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో విజయవాడ వెస్ట్, తిరువూరు తప్ప మిగతా అన్నీ నియోజకవర్గాలు టీడీపీ గెలిచింది. ఎంపీగా నాని సుమారు 75 వేల మెజారిటీతో గెలిచారు.
చదవండి: వైసీపీ గెలిస్తే ఆ టీడీపీ నేతలు జంప్ అవ్వడం ఖాయమేనట…!
టీడీపీ లెక్క ఇదే…
అయితే ఈసారి కూడా టీడీపీ మళ్లీ అవే ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. విజయవాడ తూర్పు, సెంట్రల్, నందిగామ, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో టీడీపీకి గెలుపు ఛాన్స్ ఉందన్నన ప్రచారం జరుగుతోంది.
పైగా వైసీపీకి పట్టున్న నియోజకవర్గాల్లోనూ ఎంపీ సీటు విషయంలో నానికి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. విజయవాడ వెస్ట్, సెంట్రల్, మైలవరం లాంటి నియోజకవర్గాల్లో నానికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మేర చూసుకుంటే భారీ మెజారిటీతోనే మళ్ళీ నాని గెలుస్తారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
వైసీపీ లెక్క ఇదే…
అటు వైసీపీ లెక్కల ప్రకారం నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, సెంట్రల్, వెస్ట్ సీట్లలో గెలుపు తమదే అన్న లెక్కలు వేసుకుంటోంది. ఎంపీ సీటు కూడా తాము 50 వేల పైచిలుకు మెజార్టీతో గెలుస్తామంటున్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి నానికి పీవీపీ గట్టి పోటీ ఇచ్చారని చెబుతున్నా రు. కానీ గెలుపు మాత్రం నానికి అనుకూలంగా ఉంటుందని రాజకీయ విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు.
గతంలో మాదిరిగా మెజారిటీ రాకపోయినా.. స్వల్పంగా నైనా ఆయనే గెలుపు గుర్రం ఎక్కుతారని చెబుతున్నారు. మొత్తం మీద ఎవరి లెక్కలు వారికి ఉన్న అవి కరెక్ట్ అని తెలియాలంటే 23 వరకు ఆగాల్సిందే.








