
పాట్నా: ఉత్తరప్రదేశ్‌లో తన సోదరుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీహార్ న్యాయమూర్తికి చేదు అనుభవం ఎదురైంది.
ఆయన వద్ద ట్రావెల్ పాస్ ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్ పోలీసులు రాష్ట్రంలో అడుగుపెట్టకుండా అడ్డుకున్నారు.
దాదాపు ఐదు గంటలపాటు ఆయనను నిలిపివేసినట్టు చెబుతూ బీహార్ జుడీషియల్ సర్వీసెస్ అసోసియేషన్ (బీజేఎస్ఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది.
బీహార్‌లోని సివాన్‌కు చెందిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి (ఏడీజే) రామాయణ్ రామ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ బయలుదేరారు.
లాక్డౌన్ విధుల్లో ఉన్న యూపీలోని డియోరియో జిల్లా పోలీసులు జడ్జిని రెండుసార్లు ఆపారని, గుత్ని పోలీస్ స్టేషన్లో కొన్ని గంటలపాటు ఆయన వేచి ఉండాల్సి వచ్చిందని బీజేఎస్ఏ కార్యదర్శి అజిత్ కుమార్ సింగ్ చెప్పారు.
ఈ కారణంగా ఆయన సోదరుడి అంత్యక్రియలు కూడా ఆలస్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అజిత్ కుమార్ డిమాండ్ చేశారు.
‘‘ జుడీషియల్ అధికారి.. ఆయన సోదరుడి అంత్యక్రియలకు చెల్లుబాటు అయ్యే పాస్‌తో వెళ్తుంటే డియోరియా పోలీసులు ఆయనను ఆపి ఐదు గంటలపాటు అడ్డుకున్నారు. డియోరియా ఎస్పీ, పోలీసులకు ఇలాంటి కఠిన చర్యలు తగవు’’ అని సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూపీలోని ఘజీపూర్ జిల్లా పహల్వాన్పూర్ వెళ్లేందుకు రామ్‌కు అనుమతి ఇస్తూ సివాన్ జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన అధికారిక ఉత్తర్వులను కూడా డియోరియో పోలీసులు ధిక్కరించారని అన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం డియోరియా జిల్లాలోని మెహ్రౌనా వద్ద ఉన్న చెక్‌పోస్టు వద్ద జడ్జిని ఆపివేసిన తర్వాత ఆయన గుత్ని పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.
గుత్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయనను తిరిగి చెక్‌పోస్టు వద్దకు తీసుకెళ్లి రామ్‌ను అనుమతించమని యూపీ పోలీసులను కోరారు.
అయితే, సివాన్‌లో కోవిడ్-19 హాట్స్పాట్లు చాలానే ఉన్నాయని, కాబట్టి ఆయన తిరిగి గుత్ని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని చెబుతూ అనుమతి నిరాకరించారు.
దీంతో జడ్జి రామ్ ఘజీపూర్ వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా ఎస్పీతో మాట్లాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.








