
ముంబై: కరోనా వైరస్ లాగే మతోన్మాద వైరస్ కూడా ఉందని, అది కూడా ప్రమాదకరమైనదేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. అంతేకాదు, కరోనా గురించి సోషల్ మీడియా వేదికలపై తప్పుడు సందేశాలు పంపే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చదవండి: చాలా కోపంగా ఉంది.. అయినా మీతోనే ఉన్నాం: మోదీకి కమల్ బహిరంగ లేఖ
సాంఘిక మాధ్యమాల్లో సరదాకైనా తప్పుడు సందేశాలు పంపడం మంచిది కాదని, ప్రభుత్వం అలాంటి వాటిపై కఠినచర్యలు తీసుకుంటుందని ఫేస్‌బుక్ లైవ్‌లో సీఎం హెచ్చరికలు జారీ చేశారు.
‘‘కరోనాకు మతం లేదు…’’
వాట్సాప్‌లో, టిక్‌టాక్‌లో, ట్విట్టర్‌లో ఏవేవో వీడియోలు వస్తున్నాయని, కరోనాను ఒక మతానికి అంటగట్టేలా అవి ఉంటున్నాయని, కోవిడ్-19కు మతం లేదని ఆయన గుర్తు చేశారు.
లాక్ డౌన్ ఏప్రిల్ 14న ముగుస్తుందా? లేక పొడిగించాలా? అనేది, వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఏ మేరకు పాటిస్తున్నారనే దానిపైనే లాక్‌డౌన్ ఎత్తివేత ఆధారపడి ఉంటుందని ఉద్ధవ్ స్పష్టం చేశారు.








