
హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ మినహా కార్మిక సంఘాల ఇతర డిమాండ్లు పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్లో 4 గంటలపాటు జరిగిన సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్వులు సునీల్ శర్మ, నర్సింగ్‌రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, రవాణా శాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సారాంశాన్ని సీఎం కేసీఆర్‌కు వారు వివరించారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా అధికారులు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి సీఎం కేసీఆర్ సమావేశంలో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ విషయంలో ఏం చర్యలు తీసుకోవాలో చర్చించారు.
సీఎం సూచన మేరకు ప్రస్తుతం ఆర్టీసీకి ఇన్‌ఛార్జి ఎండీగా వ్యవహరిస్తోన్న రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన మరో అయిదుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన కమిటీ ఏర్పాటైంది.
ఈ కమిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్ కుమార్, యాదగిరి, వెంకటేశ్వర్లుతోపాటు ఆర్థిక సలహాదారు రమేశ్ కూడా సభ్యులుగా ఉన్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికుల 21 డిమాండ్లను పరిశీలించి, ఒకట్రెండు రోజుల్లో ఈ కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండీకి సమర్పించనుంది. ఈ నివేదికను హైకోర్టులో ఈ కేసు తదుపరి విచారణ సందర్భంగా ప్రభుత్వం సమర్పించనుంది.
సీఎం కేసీఆర్ ఏమన్నారంటే…
సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అదే తమ ప్రథమ డిమాండ్ అని, అది జరిగాకే ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతామని తొలుత కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారని, అయితే హైకోర్టులో వారి తరపున వాదించిన న్యాయవాది ప్రకాశ్ రెడ్డి.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే తప్ప తాము చర్చలకు రాబోమని కార్మిక నాయకులు ఎప్పుడూ చెప్పలేదని తెలిపారని పేర్కొన్నారు.
దీంతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనే డిమాండ్‌ను కార్మిక నాయకులు వారంతట వారే వదులుకున్నట్లయిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లోనూ కార్మికుల ఇతర డిమాండ్లను పరిష్కరించాలంటూ సూచించారు కాబట్టి.. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను అధ్యయనం చేయాలని అధికారులకు వివరించారు.
అలాగే ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వెయ్యి బస్సులను అద్దెకు తీసుకుని నడిపించాలని, ఇందుకు అవసరమైన నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వాలని కూడా అధికారులకు సూచించారు.
బీజేపీ నాయకుల తీరు అనైతికం…
అంతేకాదు, ఆర్టీసీ కార్మిక నాయకుల ప్రోద్బలంతో చట్ట వ్యతిరేకంగా జరుగుతోన్న సమ్మెకు కాంగ్రెస్, బీజేపీలు మద్దతు పలకడం అనైతికమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న డిమాండ్లను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయా? అని ప్రశ్నించారు.
కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్నే రాష్ట్రంలో తాము అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ ఈ అంశంపై బీజేపీ నాయకులే లేనిపోని రాద్ధంతం చేస్తున్నారని, వీరి వైఖరిపై ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రికి లేఖ రాయాలనే విషయంపై కూడా సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు.








