33.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం గుడ్‌ న్యూస్! ‘జియో ఫైబర్’ కనెక్షన్‌తో ‘సెట్‌టాప్ బాక్స్’ ఉచితం, ఇంకా…

గుడ్‌ న్యూస్! ‘జియో ఫైబర్’ కనెక్షన్‌తో ‘సెట్‌టాప్ బాక్స్’ ఉచితం, ఇంకా…

jio-fiber-free-settop-box
- Advertisement -

న్యూఢిల్లీ: జియో నుంచి మరో శుభవార్త! ఇప్పటికే జియో గిగాఫైబర్ ప్రకటనతో డీటీహెచ్, కేబుల్‌ టీవీ పరిశ్రమకు గట్టి షాక్ తగలగా, తాజాగా జియో ఫైబర్ కస్టమర్లను ఆకర్షించేందుకు టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో ప్రతి జియో ఫైబర్ కనెక్షన్‌కు ఉచితంగా సెట్‌టాప్ బాక్స్ అందించనుంది.

గురువారం రిలయన్స్ జియో తన ఆప్టికల్‌ ఫైబర్‌ ఆధారిత గిగా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘కాంప్లిమెంటరీ కానుకగా రిలయన్స్ జియో తన జియో ఫైబర్‌ కస్టమర్లందరికీ సెట్‌టాప్‌ బాక్స్‌‌ను ఉచితంగా అందిస్తోంది..’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

చదవండి: నేడే ‘జియో ఫైబర్’ లాంచింగ్! రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా…

గతంలో ప్రయోగాత్మకంగా దేశంలోని కొన్ని పట్టణాల్లో జియో ఫైబర్ సేవలను ప్రవేశపెట్టిన రిలయన్స్ జియో.. ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసును ఉచితంగా ఇచ్చినప్పటికీ.. దీనికి సంబంధించిన సెట్‌టాప్ బాక్స్‌లకు మాత్రం ముందస్తు డిపాజిట్ కింద రూ.4,500, రూ.2,500 కట్టించుకుంది.

ఉచితంగా సెట్‌టాప్ బాక్స్…

అయితే ఇప్పుడు ఈ సేవలను దేశ వ్యాప్తంగా ఆరంభించిన నేపథ్యంలో.. మరింత మంది వినియోగదారులను ఆకర్షించడం కోసం ఈ సెట్‌టాప్ బాక్స్‌ను ఉచితంగానే ఇవ్వనున్నట్లు పేర్కొంది.

జియోఫైబర్‌ కస్టమర్లకు సెకనుకు 100 ఎంబీల నుంచి 1 గిగాబైట్ వరకు వేగంతో కూడిన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుతాయి. దీనికి సంబంధించి నెలసరి చార్జీలు కూడా రూ.700 నుంచి మొదలవుతాయి.

దీంతోపాటుగా ఒక ల్యాండ్‌లైన్‌ నంబర్ నుంచి జీవితాంతం ఉచిత వాయిస్‌ కాల్స్ చేసుకోవచ్చు. ఇంకా జియో ఫైబర్ ‌కనెక్ష‌న్‌తో వచ్చే సెట్‌టాప్ బాక్స్ ద్వారా 600 వరకు టీవీ చానళ్లు వీక్షించవచ్చు. ఈ మూడు రకాల సేవలు నెలకు రూ.700కే లభిస్తుండడంతో జియో ఫైబర్‌కు దేశ వ్యాప్తంగా వినియోగదారుల నుంచి అమితమైన ఆదరణ లభిస్తోంది.

అయితే అందరూ సెట్‌టాప్ బాక్స్ విషయంలోనే కాస్త ఆలోచించారు. ఇప్పుడు అది ఫ్రీగా ఇస్తుండడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది.

జియోఫైబర్‌ కస్టమర్లకు పేరొందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ మొబైల్‌ యాప్స్‌లోని వీడియో కంటెంట్, సినిమాలు మొదలైనవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ నెలసరి చార్జీలు వీటి సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు కూడా కలిపే ఉంటాయి. యూజర్లు కంటెంట్‌కు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించనక్కర్లేదు.

ఇక జియో ఇస్తోన్న సెట్‌టాప్‌ ‌బాక్స్‌కు కెమెరాను అమర్చుకుంటే ఇంట్లోని టీవీ ద్వారా వీడియో కాలింగ్‌ సేవలు కూడా పొందవచ్చు.

వార్షిక ప్లాన్ తీసుకుంటే…

జియో ఫైబర్ ‘వెల్ కమ్ ఆఫర్’ కింద వార్షిక ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులకు ఫుల్ హెచ్‌డీ టీవీ లేదా 4కే టీవీ, 4కే సెట్ టాప్ బాక్సులను ఉచితంగా అందిస్తారు. ఈ విషయాన్ని గత నెలలో జరిగిన ఏజీఎంలో రిలయన్స్ సీఎండీ ముకేశ్‌ అంబానీ స్వయంగా ప్రకటించారు.

ప్రత్యామ్నాయంలో ప్రత్యర్థి సంస్థలు…

జియోఫైబర్‌ రాకతో ఇప్పటి వరకు ఈ రంగంలో సేవలు అందిస్తోన్న చాటా సంస్థల వ్యాపారానికి గట్టి దెబ్బ తగిలే పరిస్థితి ఏర్పడింది. జియో ఆఫర్లను తట్టుకునేందుకు ఆయా సంస్థలు ఇప్పటికే టారిఫ్‌లు తగ్గిస్తూ వివిధ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.

జీ5, హుక్‌ వంటి పలు వీడియో స్ట్రీమింగ్‌ మొబైల్‌ యాప్స్‌ కంటెంట్‌‌ను అందుబాటులోకి తెస్తూ భారతీ ఎయిర్‌టెల్‌ కొత్తగా రూ.3,999కు ఒక సెట్‌‌టాప్‌ బాక్స్‌ను ఆవిష్కరించింది. ఈ సెట్‌టాప్ బాక్స్‌ను కొన్న వినియోగదారులు కంటెంట్ స్ట్రీమింగ్‌‌ను తొలి ఏడాది పూర్తి ఉచితంగా.. ఆ తర్వాత రూ.999 వార్షిక ఫీజుతో వీక్షించవచ్చు.

- Advertisement -