
శ్రీకాకుళం: ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు జగన్ పలాస చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లాలో ఇటీవల మావోయిస్టు డంప్ లభ్యం కావడంతో పాటు వాళ్ల కదలికలు కనిపించడంతో జగన్‌కు వందలాదిమందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. జగన్‌కు జడ్‌ప్లస్ కేటగిరీ భద్రత ఉండగా, శ్రీకాకుళం, విజయనగరం ఎస్పీల ఆధ్వర్యంలో భద్రతను మరింత పెంచారు.
ఇద్దరు అదనపు ఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 45 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, 118 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 215 మంది ఏఎస్‌ఐ/హెడ్‌కానిస్టేబుళ్లు, 686 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 85 మంది మహిళా పోలీసులు, 350 మంది హోంగార్డులు, 266 మందితో కూడిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందంతో ప్రత్యేక భద్రత చేపట్టనున్నారు.
ఉదయం 11:05 గంటలకు పలాస చేరుకోనున్న జగన్ ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఫిషింగ్ జెట్టీ వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యం అందించే పైలట్ ప్రాజెక్టును కూడా సీఎం ప్రారంభిస్తారు.
బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీకి చేరుకుంటారు. భోజనం తర్వాత మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు తిరిగి అమరావతి బయలుదేరుతారు.








