
హైదరాబాద్: గత నెలలో తెలంగాణలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకి జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడిన విషయం తెల్సిందే. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలని దక్కించుకుంది.
అయితే ఈ ఓట్ల లెక్కింపు సందర్భంగా కొన్ని చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు ఎంపీటీసీగా విజయం సాధించగా, బీజేపీ అభ్యర్ధి ఒకరు లాటరీ పద్ధతిలో విజయం సాధించారు.
మహబూబాబాద్ మండలంలోని శీత్లా తండాలో కాంగ్రెస్ తరుపున ఎంపీటీసీ అభ్యర్థిగా వాంకుడోతు రోజా పోటీ చేయగా, టీఆర్ఎస్ తరుపున లావొడియా బాలమణి పోటీ చేశారు.
ఇక రోజాకు 611 ఓట్లు రాగా, బాలమణికి 610 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోసం పట్టుబట్టడంతో…అధికారులు రీకౌంటింగ్ చేయగా….అందులోనూ ఫలితంలో తేడా లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి రోజా విజయం సాధించినట్టు ప్రకటించారు.
అలాగే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం పిప్రి గ్రామంలోని ఓట్ల లెక్కింపులో ఓ విచిత్రం చోటుచేసుకుంది. ఇక్కడ మొదట జరిపిన ఓట్ల లెక్కింపులో రెండు ఓట్ల మెజారిటీతో ఎంపీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీనిపై బీజేపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా రీ కౌంటింగ్‌కు పట్టుబట్టడంతో అధికారులు రీకౌంటింగ్ జరిపారు.
అయితే రీకౌంటింగ్‌లో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులిద్దరికీ చెరో 690 ఓట్లు రావడం గమనార్హం. దీంతో ఎన్నికల అధికారులు విజేతను నిర్ణయించేందుకు లాటరీ పద్ధతిని ఆశ్రయించడంతో అనూహ్యంగా విజయం బీజేపీ అభ్యర్థిని వరించింది.








