
ఢిల్లీ: ఎప్పుడు ఏదొక వివాదం కొనితెచ్చుకునే బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్…ఇఫ్తార్ విందుపై ఓ వివాదాస్పద ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తమ మిత్రపక్షనేతలు అయిన…బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఎల్జేపీ చీఫ్, కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్లు హాజరైన ఇఫ్తార్ విందుకు సంబంధించి గిరిరాజ్ సింగ్ మంగళవారం ఓ ట్వీట్ చేశారు.
ఇఫ్తార్ విందులో కనబరుస్తున్న జోరును నవరాత్రి ఉత్సవాల్లో ఎందుకు చూపించరంటూ గిరిరాజ్ ప్రశ్నించారు. అయితే ఇదే ఉత్సాహం నవరాత్రి ఉత్సవాల్లోనూ చూపిస్తే ఆ ఫొటోలు ఇంకా బాగుంటాయంటూ ఫొటోలు కూడా ట్వీట్ చేశారు.
ఇక గిరిరాజ్ ట్వీట్‌పై మిత్రపక్ష నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గిరిరాజ్ ట్వీట్‌పై అమిత్ షా వెంటనే స్పందించారు. గిరిరాజ్‌ను పిలిపించుకుని.. అనవసర ప్రకటనలు చేసి పార్టీని, మిత్ర పక్షాలను ఇరుకున పెట్టవద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. మరోసారి ఇటువంటి ప్రకటనలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.








