
హైదరాబాద్: ఫోర్జరీ కేసులో టీవీ9 మాజీ సిఈఓ రవి ప్రకాశ్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏపీసీఎల్ కంపెనీ సెక్రెటరీ దేవేంద్ర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు టీవీ 9 యాజమాన్య సంస్థ అలంద మీడియా రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు విచారణకి హాజరు కావాలని రవి ప్రకాశ్‌కి రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే వీటిపై రవి ప్రకాశ్ స్పందించలేదు. దీంతో ఇంటికి వెళ్ళిన పోలీసులు… ఆయన అక్కడ లేకపోవడంతో.. చివరిగా సిఆర్‌పిసి-41 కింద మరో నోటీస్ జారీ చేశారు. దాని ప్రకారం ఆయన మూడు రోజుల్లో పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. అలా జరగకపోతే అరెస్టు చేసే అవకాశాలున్నాయి.
చదవండి: టీవీ9 రవి ప్రకాశ్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు..
ఇదిలా ఉంటే తనపై ఉన్న కేసులపై రవి ప్రకాశ్ ఓవైపు అలంద మీడియా సంస్థ ప్రతినిధులతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే తనను అరెస్టు చెయ్యకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతానికి ఆయన ఎక్కడ ఉన్నారనేది తెలియరావడం లేదు. అయితే విచారణకు హాజరైతే కచ్చితంగా అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో రవిప్రకాశ్… విచారణకు హాజరు కావట్లేదని తెలుస్తోంది.








