
కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఒక వైపు ఈవీఎంలలో లోపాలపై పోరాటం చేస్తూనే….తమ మిత్ర పక్షాలకి మద్ధతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇప్పటికే చంద్రబాబు కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి కోసం ప్రచారం నిర్వహించారు. ఇక తమిళనాడులో కూడా డిఎంకే తరపున ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే నేడు చంద్రబాబు పశ్చిమ బెంగాల్ వెళ్లనున్నారు. మమతా బెనర్జీకి మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు.
చదవండి: టీడీపీ, కాంగ్రెస్ లకు బిగ్ షాకిచ్చిన సుప్రీం!
రెండు రోజుల పాటు పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. నేటి మధ్యాహ్నం బెంగాల్‌లోని జార్గాం, హల్దియా పట్టణాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ఇక గురువారం ఆయన కోల్‌కతా, ఖరగ్‌పూర్ నగరాల్లో ప్రచార సభలకు హాజరవుతారు. ఈ సభలకు చంద్రబాబుతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా కూడా హాజరవుతారు.
ఏపీలో ప్రచారం చేసిన మమత…
ఇదిలా ఉంటే మమతా బెనర్జీ… ఇటీవల ఏపీ వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ప్రచారం చేశారు. మోదీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచెయ్యాలని టీడీపీ శ్రేణులకు పిలుపిచ్చారు. అప్పట్లో దీదీ చేసిన ప్రసంగంపై చంద్రబాబు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇక మమతా బెనర్జీతో పాటు మిగతా మిత్ర పక్షాలకి కూడా చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.








