
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం మహర్షి. మహేశ్ 25వ చిత్రంగా వస్తున్న మహర్షి ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలోనే మహర్షి సినిమా టికెట్ల ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చిందంటూ ప్రచారం జరిగింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ టికెట్‌ను రూ.80 నుంచి రూ.110, మల్టీప్లెక్స్ టికెట్‌ను రూ.138 నుంచి రూ.200వరకు పెంచినట్టు వార్తలు వచ్చాయి.
చదవండి: మహర్షి సినిమాలోని కీలక అంశాలు ఇవే!
అయితే ఈ ప్రచారాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అసలు ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్లను ఎప్పుడూ పెంచలేదని.. ఈ సినిమా విషయంలోనూ అదే వర్తిస్తుందని చెప్పారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
5 షోలకు పర్మిషన్…
‘మహర్షి’ సినిమా రోజుకు 5 ఆటలకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 9వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు రాష్ట్రమంతటా ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య సమయంలో అదనపు ఆటకు అనుమతి లభించింది.








