

న్యూయార్క్: పాకిస్తాన్‌కు అత్యంత మిత్ర దేశమైన చైనా తన పాడు బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. భారత్ విషయానికొచ్చేసరికి దాని తీరు మాత్రం మారడం లేదు. తాజాగా తన వైఖరితో భారత్‌పై మరోమారు విషం చిమ్మింది. పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించి ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు బాసటగా నిలుస్తుంటే చైనా మాత్రం జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్‌కు అనుకూలంగా మాట్లాడింది.
జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలోని అవంతిపుర వద్ద సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై గురువారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 43 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. అయినా సరే డ్రాగన్ కంట్రీ ఈ ఉగ్రవాద సంస్థ చీఫ్, నరరూప రాక్షసుడైన మసూద్ అజహర్‌నే వెనకేసుకొచ్చింది.
మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత విదేశాంగ శాఖ తాజాగా ఐరాస భద్రతా మండలిలోని సభ్యదేశాలను కోరింది. అయితే తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించుకొని మసూద్ విషయంలో చాలా కాలంగా భారత్‌కు అడ్డు తగులుతున్న చైనా.. తాజాగా మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది.
ఒకవైపు ఈ దాడిని అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ తదితర దేశాలు ఖండించినా.. చైనా మాత్రం ఒక మొక్కుబడి ప్రకటన చేసి.. ఆ ఉగ్రవాద సంస్థ అధినేతను మాత్రం వెనకేసుకొచ్చింది. మసూద్ ఉగ్రవాది అని నిరూపించడానికి ఆధారాలు లేవని తాజాగా తేల్చి చెప్పింది.








