
నెల్లూరు: మే 23…..నేతల భవితవ్యం తేలే రోజు. అందరూ ఈ రోజు కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అటు కేంద్రంలో…ఇటు రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో తెలిసిపోతుంది.
ఇక ఆ రోజున ప్రజలు అంతా ఫలితాలు తెలుసుకోవడం కోసం టీవీలకి అతుక్కుపోతారు. అయితే అదే రోజున పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఉన్నాయి. దీంతో వారు పెళ్లిలకు కూడా వెళ్ళడం కష్టమే అని తెలుస్తోంది.
చదవండి: అన్నింట్లోనూ తాతగారి లాగే.. అంతే ఘనంగా ఎన్టీఆర్ పెళ్లి…
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన ఓ దుస్తుల దుకాణం యజమాని వెరైటీగా ఆలోచించాడు. బయ్యా వాసు తన కుమార్తె వివాహాన్ని ఈ నెల 23న ఉదయం 11.51 గంటలకు చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పెళ్లికి వచ్చే బంధువుల సంఖ్య తగ్గుతుందన్న ఆలోచనతో… పెళ్లి మండపంలోనే పెద్ద స్క్రీన్ పెట్టించి…అందులో ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అదే విషయం తన కుమార్తె పెళ్లి కార్డులో ప్రింట్ చేయించాడు.

ఇక ఈ శుభలేఖ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…. రిజల్ట్స్ ఫీవర్ వీరికి కూడా పట్టుకుంది అంటూ నెటిజన్లు జోక్స్ వేసుకుంటున్నారు. మొత్తం మీద ఒకే చోట పెళ్లి, ఎన్నికల ఫలితాలు చూసేందుకు కుదరడంతో…బంధువులు కూడా ఎక్కువ సంఖ్యలోనే హాజరవుతారని తెలుస్తోంది.








