112 రోజులుగా ప్రేక్షకుల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేసిన స్టార్ మా ‘బిగ్ బాస్ సీజన్ 2’ రియాలిటీ షో మరికొన్ని గంటల్లో ముగియబోతుంది. మొదట్లో 100 రోజులు అని ప్రకటించినా.. తరువాత షోని మరో రెండు వారాలకు పెంచారు. ‘ ఏదైనా జరగొచ్చు.. ఇంకొంచెం మసాలా..’ అంటూ నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా జూన్ 10న ఈ రియాలిటీ షో మొదలైయింది .
గతంలో ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన ‘బిగ్ బాస్ సీజన్ 1’కి చాలా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సీజన్ 2పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఈ ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆఖరి ఎపిసోడ్ కావడంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకే షో ప్రారంభం కానుంది. ఇన్నాళ్లూ ప్రతి శని, ఆదివారాల్లో నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా ఓ స్పెషల్ సాంగ్‌కి పెర్‌ఫామ్ చేస్తూ… పిట్టకథతో కార్యక్రమాన్ని ప్రారంభించే నాని, ఫైనల్ ఎపిసోడ్‌లో వినూత్నంగా స్పెషల్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడు. ఈ ఎపిసోడ్‌లో డాన్స్‌తో పాటు నాని హోస్ట్‌పై ప్రత్యకంగా 10 నిమిషాల వీడియోను ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 1 గ్రాండ్ ఫినాలేలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చారు. ఎన్టీఆర్‌తో కలిసి బిగ్ బాస్ స్టేజ్‌ని షేక్ చేశారు. మరి ‘ బిగ్ బాస్ సీజన్ 2 ’ ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఎవరు రాబోతున్నరన్నది ఇంకా సస్పెన్స్‌లోనే ఉంచారు. అలాగే సీజన్ 2 విజేతను ప్రకటించేందుకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు.
బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేకి చేరిన కంటెస్టెంట్స్: 1. గీతా మాధురి, 2. సామ్రాట్, 3. తనీష్, 4. కౌశల్, 5. దీప్తి నల్లమోతు