స్టాక్ మార్కెట్లు ఫ్లాట్… 5 రాష్ట్రాల్లో ఎన్నికలు, ద్రవ్యోల్బణం ప్రభావం, 8 వారాల గరిష్టానికి రూపాయి…

stock-exchange
- Advertisement -

stock-exchange

ముంబై: పెరిగిన ద్రవ్యోల్బణం, ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరించారు. ఫలితంగా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. బుధవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ 2 పాయింట్ల నష్టంతో 35,141కు చేరగా, నిఫ్టీ కూడా 6 పాయింట్లు కోల్పోయి 10,576 వద్ద స్థిరపడింది.

బుధవారం నాటి ట్రేడింగ‌్‌లో… అదానీ ట్రాన్స్ మిషన్ (9.99%), దిలీప్ బిల్డ్ కాన్ (9.65%), ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (7.67%), ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (7.67%), ఫ్యూచర్ కన్జ్యూమర్ (7.10%) షేర్లు లాభపడగా… అశోక్ లేల్యాండ్ (-10.46%), మదర్సన్ సుమి సిస్టమ్స్ (-7.58%), సన్ ఫార్మా (-7.36%), దీపక్ ఫర్టిలైజర్స్ (-6.40%), డీఎల్ఎఫ్ (-5.24%) షేర్లు నష్టపోయాయి.

మరింత బలపడిన రూపాయి మారకం విలువ…

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో డాలరుకు డిమాండ్‌ తగ్గింది.. దీంతో మన రూపాయి మారకం విలువ బుధవారం మరింత బలపడింది. డాలరు మారకంలో 81 పైసలు పుంజుకుని 72 వద్ద 8 వారాల గరిష్టానికి చేరింది. మంగళవారం 22 పైసలు లాభపడిన మన రూపాయి బుధవారం మరింత పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించింది. సెప్టెంబరు 21 తరువాత మళ్లీ రూ.72 స్థాయికి రూపాయి బలపడింది. ప్రస్తుతం 72.09 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

- Advertisement -