ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 35,012కి పడిపోయింది. నిఫ్టీ 68 పాయింట్లు కోల్పోయి 10,629కి పతనమైంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లుగా.. గేట్ వే డిస్ట్రిపార్క్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, సన్ టీవీ, సద్భావ్ ఇంజినీరింగ్, రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ షేర్లు నిలవగా… టాప్ లూజర్స్‌గా పీసీ జువెలర్స్ , ఇంటెలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్, క్వాలిటీ, ప్రజ్ ఇండస్ట్రీస్, ఏజీస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ షేర్లు నిలిచాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఆరంభంలో జోరుగా ఎంట్రీ ఇచ్చినా మళ్లీ ఆ జోరు కాస్త తగ్గింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న బలమైన సంకేతాలతో సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభంలోనే 300 పాయింట్లకు పైగా ఎగసి, కీలకమార్కు 35 వేలను అధిగమించి దూసుకుపోయింది. నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి, 10,770 మార్కును తాకింది. ఎక్కువగా బ్యాంకింగ్, ఆటో షేర్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింది. అయితే ఆ తరువాత ప్రారంభ జోరు కాస్త తగ్గిపోయి, సెన్సెక్స్ 57 పాయింట్ల లాభంలో 35,284 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల లాభంలో 10,710 వద్ద ట్రేడయ్యాయి.
ప్రారంభంలో హీరో మోటోకార్పొ, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్‌ఇండ్ బ్యాంకు, హెచ్‌పీసీఎల్, టాటా మోటార్స్, బీపీసీఎల్, గెయిల్, ఐఓసీ, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్ ఇండియాలు 2.5 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 54 పాయింట్లు, నిఫ్టీ బ్యాంకు 271 పాయింట్లు ర్యాలీ కొనసాగించాయి. ఆసియన్ మార్కెట్ల ఈక్విటీలు కూడా రెండున్నర వారాల గరిష్టానికి ఎగిశాయి. అమెరికా జాబ్ డేటా అంచనాలకు మించి రావడంతో, వాల్‌స్ట్రీట్‌లో నాస్‌డాక్ కాంపొజిట్ కూడా 1.51 శాతం పెరిగింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 45 పైసల లాభంలో 66.94 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 286 రూపాయల నష్టంలో 30,545 రూపాయలుగా నమోదవుతున్నాయి.