హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సవాల్ విసిరారు. బుధవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా కొడంగల్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని, తాను ఏనాడూ కొండగల్ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించలేదని.. తన నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని, అందుకే తన గెలుపు ఖాయమని తాను చెప్పగలుగుతున్నానని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
అలాగే.. టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు, కేసీఆర్‌కు చేతనైతే అసెంబ్లీ ఎన్నికలలోపు ఆ ఇద్దరు ఎంపీలను ఆపాలంటూ ఆయన సవాల్ విసిరారు.
‘‘దమ్ముంటే కొడంగల్ నుంచి నిలబడండి…’’
‘‘గజ్వేల్ నుంచి కాదు.. అసలు కేసీఆర్‌కు దమ్ముంటే ఆయన కొడంగల్ నుంచి పోటీ చేయాలి.. నామినేషన్ వేసేందుకు ఇంకా సమయం ఉంది.. కాబట్టి ఈ విషయంలో ఆయన త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలి..’’ అని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ నెల 19న తాను నామినేషన్ వేయబోతున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేకాదు, తనకు ముప్పై వేల మెజార్టీ రావడం ఖాయమని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని, టీఆర్ఎస్‌కు ప్రజలు తగినబుద్ధి చెప్పడం కూడా ఖాయమని రేవంత్ వ్యాఖ్యానించారు.