

మౌంట్ మాంగనుయ్: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా సత్తా చాటుతోంది. సోమవారం జరిగిన మూడో వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి హ్యాట్రిక్ గెలుపును అందుకుంది. తద్వారా ఐదు వన్డేల సిరీస్‌ను ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-0తేడాతో చేజిక్కించుకుంది. రోహిత్ శర్మ(62; 77 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి(60; 74 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్)లు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
రోహిత్, కోహ్లీ కీలక ఇన్నింగ్స్
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 244 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ దిగిన భారత ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (28; 27 బంతుల్లో 6×4), రోహిత్ శర్మ (62; 77 బంతుల్లో 3×4, 2×6) పోటీ పడి ఆడారు. కాగా, జట్టు స్కోరు 39 వద్ద ధావన్‌ను బౌల్ట్ ఔట్ చేశాడు.
ఆ తర్వాత వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (60; 74 బంతుల్లో 6×4) మరోసారి తనదైన ఆటను ప్రదర్శించాడు. అతడికి తోడుగా రోహిత్ శర్మ అప్పుడప్పుడు భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం అందించారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని రోహిత్‌శర్మను ఔట్ చేయడం ద్వారా శాంట్నర్ విడదీశాడు. అప్పుడు స్కోరు 152. కాగా, మరికాసేపటికే కోహ్లీని బౌల్ట్ పెవిలియన్ పంపించాడు.
అప్పటికే లక్ష్యం దగ్గరపడటంతో భారత్ విజయం సాధించేందుకు కష్టపడలేదు. అంబటి రాయుడు (40; 42 బంతుల్లో 5×4, 1×6), దినేశ్ కార్తీక్ (38; 38 బంతుల్లో 5×4, 1×6) పోటీపడి ఆడారు. నాలుగో వికెట్‌కు 77 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. దీంతో కోహ్లీసేన 43 ఓవర్లకే ఛేదన పూర్తిచేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 243 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న కివీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మున్రో(7) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఆపై కాసేపటికి గప్టిల్(13) కూడా ఔటయ్యాడు. దాంతో 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కివీస్ కోల్పోయింది. ఆ తరుణంలో కేన్ విలియమ్సన్-రాస్ టేలర్ జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 33 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్(28) పెవిలియన్ బాట పట్టాడు. రాస్ టేలర్(93;106 బంతుల్లో 9 ఫోర్లు), టామ్ లాథమ్(51; 64 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) ఆకట్టుకోవడంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది.
షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యా, చహల్, భువనేశ్వర్ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నాల్గో వన్డే గురువారం జరుగనుంది. మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన షమికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.








