

మెల్‌బోర్న్: గతంలో ఎన్నడూ లేని విధంగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మరిచిపోలేని విజయాలను నమోదు చేసింది. తొలుత 1-1తో టీ20 సిరీస్ సమం చేసిన టీమిండియా.. ఆ తర్వాత 2-1తో టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. తాజాగా, 2-1తో వన్డే సిరీస్ భారత్ సొంతమైంది. ఓ పటిష్ఠ జట్టుపై విదేశాల్లో టీమిండియా అన్ని సిరీస్‌లను కోహ్లీ నాయకత్వంలోనే అందుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.
శుక్రవారం జరిగిన చివరి వన్డే ఎంతో ఉత్కంఠగా సాగింది. తొలుత ఆసీస్ బ్యాటింగ్ చేపట్టగా.. యుజువేంద్ర చాహల్ 6/42 చెలరేగడంతో ఆసీస్ 48.4 ఓవర్లకు 230 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో మహేంద్రసింగ్ ధోనీ (87; 114 బంతుల్లో 6×4), కేదార్ జాదవ్ (61; 57 బంతుల్లో 7×4) అజేయంగా నిలిచి భారత్‌కు ఘన విజయాన్ని అదించారు. వీరు నాలుగో వికెట్‌కు 116 బంతుల్లో 121 పరుగుల భాగస్వామ్యం అందించారు.
శుభారంభం దక్కకున్నా.. రాణించిన భారత ఆటగాళ్లు
టీమిండియాకు ఛేదనలో శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ (9; 17 బంతుల్లో 1×4) జట్టు స్కోరు 15 వద్దే వెనుదిరిగాడు. సిడిల్ వేసిన 5.6వ బంతికి షాన్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. ఆసీస్ పేసర్లు రిచర్డ్‌సన్, స్టాన్‌లేక్ బంతుల్ని చక్కగా అడ్డుకున్నాడు. వారికి తోడైన స్పిన్నర్ జంపా బౌలింగ్‌లోనూ ఒక్కో పరుగు సాధించాడు.
జట్టు స్కోరు 59 వద్ద ధావన్ (23; 46 బంతుల్లో)ను స్టాయినిస్ ఔట్ చేయడంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. ధోనీ, కోహ్లీ మూడో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం అందించారు. అర్ధశతకానికి చేరువైన విరాట్‌ను 30 ఓవర్ చివరి బంతికి రిచర్డ్‌సన్ పెవిలియన్ పంపించాడు. అప్పటికి జట్టు స్కోరు 113.
ధోనీ-జాదవ్ ఆటతీరు అద్భుతం
విరాట్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్ తొలుత పరుగులు చేసేందుకు తడబడ్డాడు. కొంతసేపటికి నిలదొక్కుకున్న తర్వాత బౌండరీలు బాదేశాడు. అప్పటికే క్రీజులో ఉన్న ధోనీ అర్ధశతకానికి చేరువయ్యాడు. అనవసర షాట్లకు ప్రయత్నించకుండా పరుగులు రాబట్టాడు.
డ్రింక్స్ బ్రేక్ తర్వాత మహీ అర్ధశతకం సాధించాడు. చివరి ఐదు ఓవర్లలో భారత్ 44 పరుగులు చేయాల్సి ఉండగా కేదార్ జాదవ్ సమయోచితంగా వరుస బౌండరీలు సాధించి అర్ధశతకం సాధించాడు. చివరి 12 బంతుల్లో 14 పరుగులుగా మారడంతో భారత్ విజయం ఖాయమైంది. స్టాయినిస్ వేసిన 49 ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి.
49.2వ బంతికి జాదవ్ బౌండరీ బాదడంతో విజయం టీమిండియా వశమైంది. దీంతో 2-1తో వన్డే సిరీస్ భారత్ కైవసం చేసుకుంది. కాగా, చాహల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ధోనీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కించుకున్నారు. టీమిండియాలో ధోనీ స్థానంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో అతను చేసిన ఈ ఇన్నింగ్స్ అతనిలో సత్తా తగ్గలేదని నిరూపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
సంబంధిత వార్తలు చదవండి
చివరి వన్డే: చాహల్ దెబ్బకు కుప్పకూలిన ఆసీస్.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం








