హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దివంగత పి.జనార్ధన్ రెడ్డి కుమారుడు, ప్రస్తుత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మహాకూటమి తరుపున పోటీకి దిగిన విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ శత్రువుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ఆ దిశగా ఇప్పటికే ఎన్నోసార్లు ఆరోపణలు, విమర్శలు గుప్పించారని, చంద్రబాబును విమర్శించే విషయంలో కేసీఆర్ తన హద్దుల్లో ఉండటం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెళ్లి…
విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వెళ్లారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాకూటమి అభ్యర్థిగా ఎన్టీఆర్ భవన్‌కు వచ్చానని… ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించబోతోందని… టీఆర్ఎస్‌కు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.
పీజేఆర్, చంద్రబాబు ఆశీస్సులతోనే…
అంతేకాదు, పీజేఆర్, చంద్రబాబు ఆశీస్సులతోనే తాను ఎన్నికల బరిలోకి దిగానని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. మహాకూటమి తరపున తొలి విజయం సాధించేది తానే అని ధీమా వ్యక్తం చేశారు. పీజేఆర్ కు పోటీగా ఎవరూ అభ్యర్థిని నిలబెట్టలేదని… కానీ, టీఆర్ఎస్ నిలబెట్టిందంటూ ఆయన మండిపడ్డారు.