హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో టీడీపీది ఖాళీ అయిపోయిన పరిస్థితి. తెలంగాణలో ఆమధ్య జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో ఇప్పుడు టీ-టీడీపీకి ఇక్కడ సరైన నాయకత్వమే కరవైంది.
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీ-టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రమే గెలిచారు. అది కూడా ఖమ్మం నుంచే. ఒకరు సండ్ర వెంకటవీరయ్య కాగా, రెండో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు.
ఇప్పుడు సండ్ర కూడా తెరాసలో చేరుతున్నారు. ఇక మెచ్చా కూడా సండ్ర బాటలోనే నడుస్తారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు కొట్టి పారేశారు.
టీ-టీడీపీలో భారీ మార్పులు…?
ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ బలోపేతానికి త్వరలోనే గట్టి చర్యలు తీసుకోనున్నారని, వచ్చే రెండేళ్లలో టీ-టీడీపీకి కొత్త నాయకత్వం రానుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. టీ-టీడీపీ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్ చేపట్టే అవకాశం ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.
నిజానికి 2012లోనే జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత వివాదం చెలరేగింది. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి లోకేష్ ఉంటారని, తెలంగాణలో పార్టీ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలనే వాదన కూడా తెరపైకి వచ్చింది.
ఓ సందర్భంలో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తుండగా.. జూనియర్ ఎన్టీఆర్‌ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా చేయాలని ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడే అలాంటివి తెరపైకి తేవద్దనే విధంగా చంద్రబాబు వారికి అప్పట్లో సూచనలు చేశారు.
అయితే తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం పరిణామాలు మారిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ సోదరి, దివంగత నేత హరికృష్ణ తనయ సుహాసినికి కూకట్‌పల్లి అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె పోటీ చేసి ఓడిపోయారు.
సుహాసినికి టిక్కెట్ ఇచ్చిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మధ్య సయోధ్య కుదురుతుందనే వాదనలు కూడా వినిపించాయి.
చదవండి: టీడీపీకి షాక్: టీఆర్ఎస్‌లో చేరుతున్నానంటూ సండ్ర, ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…








