ఖమ్మం: సుదీర్ఘ కాలంపాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఇటీవలే తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌లో చేరిన నామా నాగేశ్వరరావుకు పాత పార్టీ వాసన పోనట్టుంది. అందుకే తాజాగా, ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో పాత పార్టీ గుర్తైన సైకిల్‌కే ఓటేయమనడం చర్చనీయాంశంగా మారింది.
కారు.. కారు.. అంటూ కేకలు
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నామా నాగేశ్వరరావు.. కారు గుర్తుకే ఓటేయాలని కోరడానికి బదులు.. సైకిల్ గుర్తుకే ఓటేయాలంటూ ఏకంగా మూడుసార్లు నినాదాలు చేశారు. దీంతో ప్రచారంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా బిత్తరపోయారు. కారు కారు అంటూ కేకలు వేశారు.
వెంటనే తేరుకున్న పార్టీ నేతలు…. మీరు ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు.. టీడీపీలో కాదంటూ నామా నాగేశ్వరరావును అప్రమత్తం చేశారు. దీంతో నాలిక కరుచుకున్న నామా.. తన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. నామాకు ఇంకా టీడీపీ వాసన పోయినట్లు లేదే అంటూ నెటిజనర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి నామా నాగేశ్వరరావు పరాజయం పొందారు. అయితే తెలంగాణ టీడీపీలో ఉంటే తన మనుగడ కష్టమని గ్రహించిన ఆయన ఆ తర్వాత అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇది ఇలావుంటే, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రేణుకా చౌదరి బరిలో ఉన్నారు. నామా నాగేశ్వరరావు 2009 ఎన్నికల్లో రేణుకా చౌదరిపై టీడీపీ తరఫున ఎంపీగా గెలిచారు.








