
తెలంగాణ: తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు ఈ రోజు విడుదలకానున్నాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మే 31న జరిగిన విషయం తెలిసిందే. మూడు జిల్లాల్లో ఉదయమే ఓట్ల లెక్కింపు ప్రారంబించి , వీలైనంత త్వరగా ఫలితాలని వెల్లడిస్తామని తెలిపారు.
ఈ మూడు స్థానాలకు తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడ్డారు. గెలుపుపై టీఆర్ఎస్ ధీమావ్యక్తం చేస్తుండగా, లోక్‌సభ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని కాంగ్రెస్ స్పష్టంచేస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పోటీచేశారు.
అటు వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ తరపున పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగాల వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేశారు.
2016లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా పట్నం నరేందర్‌రెడ్డి, వరంగల్ నుంచి కొండా మురళి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఐతే గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నరేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి పోటీచేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అటు కొండా మురళి వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ మూడు స్థానాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించారు.








