
హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరతామని ప్రకటించగా.. తాజాగా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా అదే జాబితాలో చేరారు.
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సండ్ర వెంకటవీరయ్య స్పష్టంచేశారు. సత్తుపల్లితోపాటు పూర్వ ఖమ్మం జిల్లా అభివృద్ధి, సంక్షేమం కోసం నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సండ్ర కలిసిన నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో సండ్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టతనిచ్చారు. ‘పార్టీ ఇచ్చిన గుర్తింపునకుగాను తెలుగుదేశంలో సుదీర్ఘ కాలంపాటు నిబద్ధతతో పనిచేశా. ఇటీవల తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలంతా టీఆర్ఎస్‌వైపు మొగ్గుచూపారు. మహాకూటమిని తిరస్కరించారు’ అని అన్నారు.
అంతేగాక, ‘రాష్ట్రంలో టీడీపీ ఉనికిని కోల్పోయింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు జనం ఓటేశారు. ఇప్పుడు ప్రజలంతా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నన్ను గెలిపించిన సత్తుపల్లి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నా. టీఆర్ఎస్‌లో చేరాలని వారంతా ఒత్తిడి చేస్తున్నారు. అందుకే రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామిని అయ్యేందుకు టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా’ అని సండ్ర స్పష్టం చేశారు.
‘శనివారం సీఎం కేసీఆర్‌తో భేటీ సందర్భంగా ఈ అంశంపై చర్చించాను. జిల్లాలో 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందాను. నేను ఎలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడలేదు. పనితనం చూసే ప్రజలు నన్ను గెలిపించారు. అంతగా ఆదరించిన ప్రజలకు న్యాయం చేసేందుకే పార్టీ మారుతున్నా.. ఇందులో వ్యక్తిగత ప్రయోజనాలేవీ లేవు. నేతలు, కార్యకర్తలను సంప్రదించిన తర్వాత టీఆర్ఎస్‌లో ఎప్పుడు చేరేది వెల్లడిస్తా. పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే అంశంపై చర్చిస్తున్నా’ అని సండ్ర వ్యాఖ్యానించారు.
‘సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం రైతుల కలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు. అభివృద్ధి ఫలాలు సత్తుపల్లికి అందాలి’ అని సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే గెలువగా.. ఇప్పుడు సండ్ర పార్టీ మారుతుండటంతో ఆ పార్టీ తెలంగాణలో దాదాపు ఖాళీ అయినట్లేనని తెలుస్తోంది.
ఇప్పటికే టీఆర్ఎస్‌లోకి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్‌కు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు త్వరలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయని తాము భావిస్తున్నట్లు వారు ప్రకటించారు. అందుకే ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే బలపర్చాలని నిర్ణయించుకున్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి పార్టీలో చేరే విషయం, విధివిధానాలు రూపొందించుకుంటామన్నారు. అవసరమైతే శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి తిరిగి టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వాళ్లు ప్రకటించారు. కాగా, తమ ఎమ్మెల్యేలను ఎంత ఖర్చుపెట్టి కొన్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం కేసీఆర్‌పై మండిపడుతున్నారు.








