

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిర్బంధం వ్యవహారంలో ఆయనకు ఎంత నష్ట పరిహారం ఇస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో బుధవారం ఆసక్తికర వాదనలు సాగాయి.
రేవంత్‌ది అక్రమ నిర్బంధం కాదని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ అనవసరమని, ఈ కేసుని మూసివేయాలని కోర్టుని అభ్యర్తించారు.
అసలేం జరిగిందంటే…
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ని అక్రమంగా నిర్బంధించారని ..దానికి పరిహారంగా 25 లక్షల రూపాయలు ఇప్పించాలంటూ కాంగ్రెస్ నేత వేం నరేందర్రెడ్డి ఏపీఎస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది .
రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలలో ఒక కీలకనేత. ప్రభుత్వమా, ప్రతిపక్షమా అని ఆలోచించకుండా, ఏదైనా నిర్మోహమాటంగా చెప్పగలిగిన నేత అయన . కానీ, కొన్ని అనూహ్య పరిణామాల మధ్య మొన్న తెలంగాణ లో జరిగిన ముందస్తు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందారు.
ఇకపోతే ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన కొడంగల్ లో హైడ్రామా నడిచింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కొడంగల్ ప్రాంతానికి వెళ్లాలని భావించిన సమయంలో కొడంగల్ లో ఉన్న రేవంత్‌రెడ్డిని పోలీసులు ఒక రహస్య ప్రాంతానికి తరలించారు.
ఈ విషయంపై రేవంత్ తరఫు న్యాయవాది పీవీ మోహన్ రెడ్డి అభిప్రాయాన్ని కోర్టు కోరగా, ఆయన తన వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం కోరుతున్నట్టుగా కేసును మూసివేస్తే, పోలీసులు పిటిషనర్ తో వ్యవహరించినట్లుగానే ఇతరులతోనూ వ్యవహరిస్తారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి తన క్లయింట్ కు పరిహారం ఇప్పించాలని, అది లక్ష రూపాయలు అయినా, ఒక్క రూపాయి అయినా అభ్యంతరం లేదని అన్నారు. పరిహారం చెల్లిస్తే, ప్రభుత్వం తప్పు చేసినట్లు రుజువవుతుందని అన్నారు.
ఆయన్ను అరెస్ట్ చేసేందుకు దారితీసిన పరిస్థితులను కోర్టుకు అందిస్తామని ఏజీ చెప్పడంతో విచారణను 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టీ అమర్ నాథ్ గౌడ్ ల ధర్మాసనం పేర్కొంది.








