
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వార్ జోన్‌లో ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ కోసం తాను పోరాడుతాననీ, ఇది తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
సంప్రదాయాల పేరిట కాంగ్రెస్ మద్దతు కోరిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బలం ఉన్నప్పటికీ అభ్యర్థిని పోటీకి ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో బుధవారం సీఎల్పీ నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
‘‘అధిష్ఠానం ఆదేశిస్తే ఎక్కడ్నించైనా పోటీ..’’
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో పార్టీ గెలిచినా, ఓడినా కార్యకర్తల్లో ధైర్యం, ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం కాంగ్రెస్ ముఖ్యనేతలపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ, మూడు నెలల తర్వాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందో చెప్పాలని కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాదు, కేసీఆర్ గచ్చిబౌలి దివాకర్ అయితే.. కాంగ్రెస్ పార్టీ సచిన్ టెండూల్కర్ అని రేవంత్ రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు.








