25.2 C
Hyderabad
Monday, November 9, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ షాకింగ్: ఒక్క తప్పుకే ఈనాడు రిపోర్టర్ అక్రిడిటేషన్ రద్దు చేసిన కలెక్టర్!

షాకింగ్: ఒక్క తప్పుకే ఈనాడు రిపోర్టర్ అక్రిడిటేషన్ రద్దు చేసిన కలెక్టర్!

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపు ఇచ్చిన జర్నలిస్టులపై తెలంగాణ ప్రభుత్వమే ఉక్కుపాదం మోపుతోందని, ఏ మాత్రం అవకాశం దొరికినా కేసులు పెడుతోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనికి ఓ మచ్చుతునకగా ఈ వార్తను చెప్పుకోవచ్చు. ఒక్క తప్పుకే ఏకంగా ఓ జర్నలిస్టు అక్రిడిటేషన్‌ను రద్దు చేసేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలేం జరిగిందంటే.. హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని తార్నాక నుంచి అమీర్ పేట‌కు మారుస్తున్నార‌ంటూ ఏప్రిల్ 14వ తేదీన ‘ఈనాడు’ దినప‌త్రిక‌లో ఓ వార్త ప్ర‌చురితమైంది. అయితే ఇందులో వాస్తవం లేదు. ఇది రాసింది ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ భానుచందర్ రెడ్డి. సరే.. ఏదో తనకు వచ్చిన సమాచారం ఆధారంగా.. ఆ రిపోర్టర్ రాసేశాడు. అది తప్పు. అయితే వివరణ అడగాలి.

మీ రిపోర్టర్ ఏ ఆధారం లేకుండానే ఇలా రాసేశాడంటూ ఈనాడు యాజమాన్యానికి ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఆ తప్పుడు వార్త రాసినందుకు ఖండన వేయమంటూ అడగొచ్చు. కొన్ని కొన్నిసార్లు వార్తల్లో తప్పులు దొర్లడం, వాటికి ఖండనలు వేయడం పరిపాటే. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఆ వార్త రాసిన స్టాఫ్ రిపోర్టర్ భానుచందర్ రెడ్డి అక్రడిటేషన్ మేడ్చెల్ జిల్లా కలెక్టర్ ఏకంగా రద్దు చేసి పారేశారు.

వార్త రాసే ముందు ఏ రిపోర్టర్ అయినా నిజానిజాలు నిర్దార‌ణ చేసుకోవాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహాం లేదు. అయితే కొన్నిసార్లు పొర‌పాట్లు కూడా జ‌రుగుతాయి. కానీ పొరపాటున ఒక వార్త తమకు వ్యతిరేకంగా ప్రచురితమైందని, ఆ అక్కసుతో అందుకు కారణమైన రిపోర్ట‌ర్ అక్రిడిటేష‌న్ ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకోవచ్చా?

ఎందుకంటే, పొద్దున లేచి చూస్తే.. ఎన్ని పేపర్లలో ఎన్ని తప్పులు దొర్లడం లేదు? ఒకవేళ తప్పుడు వార్త అయి, ఆ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళితే ఏ పత్రికా యాజమాన్యమైనా సరే ఖండన ప్రచురించకమానదు. కావాలంటే.. ఆ రిపోర్టర్‌ను పిలిచి క్షమాపణ అడిగితే సరిపోతుంది. విచిత్రం ఏమిటంటే.. అదే రిపోర్టర్ ఆ వార్తపై ఖండన కూడా ప్రచురించినట్లు తెలుస్తోంది. మరి దాన్ని చూసిన తరువాత అయినా కలెక్టర్ మొదటి తప్పు కింద హెచ్చరించి వదిలేయాల్సింది.

అలా జరగలేదు సరికదా.. వార్త ప్రచురితమైన ఐదు రోజుల తరువాత ఏకంగా ఆ రిపోర్టర్ అక్రిడిటేషన్‌నే ప్రభుత్వ ప్రతినిధి అయిన కలెక్టర్ రద్దు చేసేశారు. ఈ మేరకు ఈనాడు యాజమాన్యానికి రాసిన లేఖలో.. సదరు రిపోర్టర్ అక్రిడిటేషన్ కార్డును సంబంధిత డీపీఆర్వోకు సమర్పించాలని సూచించారు.

అంటే కేసీఆర్ ప్రభుత్వం.. పత్రికలు, రిపోర్టర్లకు ఏం చెప్పదలుచుకుంది? తమ గురించి ఏ వ్యతిరేక వార్త రాసినా.. ఇదే గతి పడుతుందని ఈ చర్య అర్థమా? ప్రత్యేక తెలంగాణ సాధించేసుకున్నాం కాబట్టి ఇక పత్రికలు, జర్నలిస్టుల సహాయ సహకారాలు అవసరం లేదనేనా?

మరి గతంలో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా.. ఇలాంటి ఘటనలు జరిగాయా? అప్పుడు వచ్చినవన్నీ నిఖార్సయిన వార్తలేనా? ఒక్క తప్పుడు వార్త కూడా ఉండి ఉండదా? అసలు ఇదేం సంప్రదాయం?

ఈ నేపథ్యంలో ప్రస్తుతం మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్ నిర్ణ‌యంపై జ‌ర్న‌లిస్ట్ సంఘాలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. వెంట‌నే ర‌ద్దు చేసిన రిపోర్ట‌ర్ భానుచందర్ రెడ్డి అక్రిడేష‌న్ ను పున‌రుద్ద‌రించాల‌ని డిమాండ్ చే్స్తున్నాయి.

- Advertisement -