
హైదరాబాద్: లాక్డౌన్ సమయంలో మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108కి వస్తున్న ఫోన్ కాల్స్ చూసి అధికారులు విస్తుపోతున్నారు.
ఈ నంబరుకు ఫోన్ చేస్తున్న వారిలో దాదాపు 80 శాతం మంది మద్యం షాపులు తెరవాలని కోరుతున్నారు. మందు లేక చనిపోవాలనిపిస్తోందని, అర్జెంటుగా దుకాణాలు తెరవాలని అభ్యర్థిస్తున్నారు.
మద్యానికి బానిసైన కొందరు అది దొరక్క ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు, వింతగా ప్రవర్తిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి కూడా.
అటువంటి వారికి హైదరాబాద్ సహా జిల్లా ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం, అధికారుల దృష్టంతా కరోనాపైనే ఉండడంతో ఈ విషయంపై పెద్దగా దృష్టి సారించలేకపోతున్నాయి.
దీంతో తమకు వస్తున్న ఫోన్ కాల్స్‌కు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని కాల్ సెంటర్ అధికారులు చెబుతున్నారు.
కాగా, మద్యానికి బానిసైన వారు దానిని తీసుకోకపోతే మూడు వారాల తర్వాత వారిలో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మానసిక వైద్యులు చెబుతున్నారు.
ఇలాంటి వారిలో 20 శాతం మందిలో పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.








