

హైదరాబాద్: మహాకూటమి ఓటమిపై భాగస్వామ్య పక్షమైన తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం నోరు విప్పారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి భాగస్వామ్య పక్షాల వ్యవహరించిన తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు, ప్రచారం తదితరాలపై తాను భాగస్వామ్య పక్షాల నాయకులకు ముందే చెప్పానని, అయినా వారెవరూ వినిపించుకోలేదని, అందుకే ఓడిపోయామని తేల్చేశారు.
కేసీఆర్ శైలి గురించి ముందుగానే చెప్పినా…
గత నెలలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో ఏర్పాటైన మహాకూటమి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై రాజకీయ విశ్లేషణ జరగాల్సి ఉందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. కేసీఆర్ శైలి గురించి తాను ముందుగానే వివరించానని, చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినా తన మాటలు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
మహాకూటమి ప్రచారంలో సమగ్ర వ్యూహం లోపించిందని కోదండరాం వ్యాఖ్యానించారు. ప్రచార పర్వానికి మూడు వారాలు సరిపోతుందని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానిస్తే.. 15 రోజులు ప్రచారం చేసినా సరిపోతుందని ఉత్తమ్ కుమార్ అన్నారని చెప్పారు.
తాను కేసీఆర్‌తో పదేళ్లపాటు కలిసి పనిచేశానని, కేసీఆర్ శైలి గురించి తనకు అవగాహన ఉందని.. ఈ విషయమే తాను మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల నేతలకు ఎన్నిసార్లు చెప్పినా వారు వినిపించుకోలేదని అన్నారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ కాదు…
నిజానికి కేసీఆర్‌పై తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆయితే ఈ ఎన్నికలతో ఆయన తనపై ఉన్న రాజకీయ వ్యతిరేకతను చల్లబరుచుకోగలిగారని కోదండరాం అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో మాత్రం కేసీఆర్ సక్సెస్ కాబోరని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వెనక ఎవరు ఉన్నారో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
నాలుగేళ్ల శ్రమ వృథా…
సమయాభావం వల్లనే ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయలేకపోయామని కోదండరాం చెప్పారు. తమకు మంచి ఎజెండా, మేనిఫెస్టో ఉన్నప్పటికీ వాటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లలేకపోయామని, దీంతో తమ నాలుగేళ్ల శ్రమ వృథా అయిందని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాదు, మహాకూటమిలోని కొంతమంది నేతల అతి ఆత్మవిశ్వాసం కూడా తమ కొంపముంచిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత అసలు కారణాలను విశ్లేషించకుండా, కేవలం ఈవీఎంలను నిందించడంలో అర్థం లేదన్నారు. మరి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని విలేకరులు అడగ్గా.. ఆ అంశంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోదండరాం చెప్పారు.








