టీఆర్ఎస్ గూటికి.. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్?

6:40 am, Sat, 28 September 19

హైదరాబాద్‌: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. పార్టీ మార్పుపై మీడియా అడిగిన ప్రశ్నకు అజారుద్దీన్‌ సూటిగా స్పందించకపోవడం ఇందుకు ఊతమిస్తోంది.

కాంగ్రెస్‌ వర్గాలు మాత్రం దీనిని ధ్రువీకరించడంలేదు. హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలిచిన అజారుద్దీన్‌ ప్యానల్‌ మొత్తం నేడు సీఎం కేసీఆర్‌ను కలుసుకోనుంది. సీఎంతో అజార్‌ భేటీ తర్వాత ఆయన పార్టీ మార్పుపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

వాస్తవానికి గత లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని ఏ స్థానం నుంచీ కాంగ్రెస్‌ టికెట్‌ లభించకపోవడంతో అజార్‌ అసహనంగా ఉన్నారు. హెచ్‌సీఏ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఇది తెరపైకి వచ్చింది.

కేటీఆర్‌తో భేటీ…

ఈ ఎన్నికల ముందు అజారుద్దీన్.. మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అప్పటికే హెచ్‌సీఏపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న మాజీ ఎంపీ వివేక్‌.. టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరడంతో తన ప్యానల్‌కు మద్దతివ్వాల్సిందిగా కేటీఆర్‌ను అజార్‌ కోరారు.

లోధా కమిటీ సిఫారసుల నేపథ్యంలో వివేక్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురైనా.. ఆయన మద్దతిచ్చిన ప్యానల్‌ను ఓడించడం ద్వారా ఆయనను దెబ్బతీయాలని టీఆర్‌ఎస్‌ పట్టుదలతో ఉంది.

ఈ నేపథ్యంలోనే అజార్‌ విజ్ఞప్తికి కేటీఆర్‌ సుముఖత వ్యక్తం చేశారని, ఈ సందర్భంగానే ఆయనను పార్టీలో చేర్చుకోవడంపైనా చర్చించారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పీసీసీ మాజీ చీఫ్‌, హెచ్‌సీఏ సభ్యుడు వి.హన్మంతరావు కూడా అజార్‌కు మద్దతు ప్రకటించారు.

ప్యానల్‌ ఆరు స్థానాల్లోనూ గెలుపు…

హెచ్‌సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్‌ ప్యానల్‌ ఆరు స్థానాలనూ గెలుచుకోవడంతోపాటు 74 ఓట్ల మెజారిటీతో అధ్యక్షుడిగా అజార్‌ విజయం సాధించారు. హెచ్‌సీఏలో మొత్తం 227 ఓట్లు ఉండగా.. 223 ఓట్లు పోలయ్యాయి.

ఇందులో అజార్‌కు 147 ఓట్లు రాగా, వివేక్‌ మద్దతిచ్చిన ప్రకాశ్‌ జైన్‌కు 73 ఓట్లు, దిలీప్‌కు 3 ఓట్లు పడ్డాయి. ఫలితాల అనంతరం అజార్‌ స్వయంగా మంత్రి కేటీఆర్‌కు ఫోన్‌ చేసి కృతజ్ఞతలు తెలిపినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

‘‘ఆ విషయంపై తర్వాత మాట్లాడతా..’’

ఈ క్రమంలోనే.. హెచ్‌సీఏ ఎన్నికలకు ముందు కుదిరిన అవగాహనలో భాగంగానే అజార్‌ టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ వార్తలను ఆయన కనీసం ఖండించలేదు.

ఇది రాజకీయాలు మాట్లాడుకునే వేదిక కాదని, తర్వాత పత్రికా సమావేశం పెట్టి మాట్లాడతానని అన్నారు. రాష్ట్రానికి బాస్‌ అయిన సీఎం కేసీఆర్‌ను కలిసి క్రికెట్‌ అభివృద్ధిపై చర్చిస్తానన్నారు.

హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అజారుద్దీన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభినందనలు తెలిపారు. వీహెచ్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు గాంధీభవన్‌లో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచారు.