

హైదరాబాద్: కరీంనగర్ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో వెళ్లి దాడులు చేయడం ఏంటని ప్రశ్నించింది. పోలీసులకు యూనిఫాం, దానిపై పోలీసు పేరు, కోడ్ ఉంటాయని గుర్తు చేసింది. యూనిఫాంను పక్కన పెట్టి సివిల్ డ్రెస్సులో వెళ్లి ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలను ఉపేక్షించేది లేదని ఘాటుగా స్పందించింది.
హైకోర్టు ఆదేశాలున్నా కూడా, వాటిని పట్టించుకోకుండా సివిల్ డ్రెస్సులో వెళ్లి ఓ రిసార్ట్‌లో దాడులు చేయడాన్ని తప్పుపట్టింది. అంతేగాక, నేరశిక్షాస్మృతి (సీఆర్‌పీసీ) కంటే పోలీసులు ఉత్తర్వులు గొప్పవి కావన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పోలీసులకు హితవు పలికింది. పోలీసులు తమ పరిధిని దాటి వ్యవహరించరాదని స్పష్టం చేసింది.
తమ ఆదేశాలకు విరుద్ధంగా దాడులు చేసిన పోలీసులను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఈ కేసులో హాజరు కావాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ)ను ఆదేశించింది. తదు పరి విచారణను ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి. సంజయ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదేశాల ధిక్కారంపై ఆగ్రహం
రమ్మీ చట్టవిరుద్ధం కాదని హైకోర్టు చెప్పినా పోలీసులు కరీంనగర్‌లోని తమ రిసార్ట్‌పై తరచూ దాడులు చేస్తుండటాన్ని ప్రశ్నిస్తూ పుష్పాంజ లి కంట్రీ రిసార్ట్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపి పుష్పాంజలి కంట్రీ రిసార్ట్‌పై దాడులు చేయరాదని పోలీసులను ఆదేశించింది. అయినా పోలీసులు వైఖరి మార్చుకోకపోవడంపై యాజమాన్యం కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ విచారించారు. ఈ సందర్బంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీ కమలాసన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ తిరుపతి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ శశిధర్ రెడ్డిపై ఈ మేరకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.








