

భూపాలపల్లి: లంచం అడుగుతున్న అధికారికి బుద్ధి చెప్పాలని ఓ వృద్ధ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్కు చెందిన మాంత బసవయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ పట్టా భూములకు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దారు రూ. లక్ష లంచం అడుగుతున్నారని శుక్రవారం జిల్లా కేంద్రంలో భిక్షాటన చేశారు.
ఈ వృద్ధ దంపతులు తమ9 ఎకరాల భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని రెండేళ్లుగా తిరుగుతున్నారు. రెండు నెలల క్రితం తహసీల్దారు కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు. అయినా ఎలాంటి ఫలితం లేదు.
ఇటీవల జేసీ స్వర్ణలత తహసీల్దారును ఆదేశించినా ఫలితం లేకపోయింది. చివరగా తహసీల్దారుకు లంచం ఇస్తేనే పాసు పుస్తకం జారీ చేస్తారనే ఉద్దేశంతో భిక్షాటనకు దిగారు. పలు దుకాణాలు, కనబడ్డవారిని భిక్షం అడుగుతూ తిరిగారు.
భిక్షాటనతో కదిలిన యంత్రాంగం
ఈ విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో కూడా విస్తృత ప్రచారం జరిగింది. దీంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తక్షణం స్పందించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ వృద్ధ దంపతులను భూపాలపల్లి ఆర్డీవో వెంకటాచారి తన కార్యాలయానికి పిలిపించి 4.10 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకాన్ని జారీ చేశారు. మిగతా 5.07 ఎకరాల భూములు వివాదంలో ఉన్నందున పూర్తిగా పరిశీలించి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేస్తామని ఆర్డీవో తెలిపారు. దీంతో వారి సమస్య కొంత వరకు పరిష్కారమైనట్లైంది.








